-

2020లో వారెన్‌ బఫెట్‌ సంపదకు చిల్లు

22 Jul, 2020 11:52 IST|Sakshi

బెర్క్‌షైర్‌ హాథవే మార్కెట్‌ విలువలో కోత

వారాంతానికల్లా 90 బిలియన్‌ డాలర్లు ఆవిరి

ఈ ఏడాది 16 శాతం క్షీణించిన షేరు 

జేపీమోర్గాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాకూ నష్టాలు

ఎగ్జాన్‌ మొబిల్‌, వెల్స్‌ఫార్గో సైతం ఇదే బాటలో

ఫాంగ్‌ స్టాక్స్‌ విలువ 560-100 బిలియన్‌ డాలర్ల మధ్య ప్లస్

కోవిడ్‌-19 ప్రపంచ దేశాలను.. ప్రధానంగా అమెరికాను సునామీలా చుట్టుమడుతున్నప్పటికీ స్టాక్‌ మార్కెట్లు రోజురోజుకీ బలపడుతున్నాయి. యూఎస్‌ ఇండెక్సులలో నాస్‌డాక్‌ ఈ ఏడాది(2020) పలుమార్లు సరికొత్త గరిష్టాలను అందుకుంది. ఇందుకు ప్రధానంగా ఫాంగ్‌(FAANG) స్టాక్స్‌ సహకరించాయి. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ దిగ్గజం ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ మాత్రం వెనకడుగులో ఉంది. ఈ ఏడాది బెర్క్‌షైర్‌ షేరు 16 శాతం తిరోగమించింది. ఫలితంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ బెర్క్‌షైర్‌ హాథవే మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో 90 బిలియన్‌ డాలర్లమేర ఆవిరైంది. వెరసి కంపెనీ మార్కెట్‌ విలువ 460 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ఇదే సమయంలో ఫాంగ్‌ స్టాక్స్‌గా ప్రసిద్ధమైన అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌తోపాటు ఇటీవల ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా ఇంక్‌ సైతం దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..

కారణాలేవిటంటే?
2020లో ఇప్పటివరకూ అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా, గూగుల్.. విడిగా 560-100 బిలియన్‌ డాలర్ల మధ్య మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను జమ చేసుకున్నాయి. ఇదే కాలంలో బెర్క్‌షైర్‌ హాథవే 90 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను కోల్పోయింది. ఇందుకు ప్రధానంగా బెర్క్‌షైర్‌ హాథవే పోర్ట్‌ఫోలియోలోని నాలుగు దిగ్గజ కంపెనీల వెనకడుగు కారణమైనట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బెర్క్‌షైర్‌ పోర్ట్‌ఫోలియోలో బ్యాంకింగ్‌ దిగ్గజాలు జేపీ మోర్గాన్‌, వెల్స్‌ఫార్గో, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాతోపాటు.. ఇంధన రంగ దిగ్గజం ఎగ్జాన్‌ మొబిల్‌కు ప్రాధాన్యత ఉంది. ఈ నాలుగు కంపెనీల షేర్లు సైతం ఇటీవల నీరసించడంతో వీటి మార్కెట్‌ విలువలోనూ 110-140 బిలియన్‌ డాలర్ల మధ్య ఆవిరైంది. ఇది బెర్క్‌షైర్‌ హాథవే మార్కెట్‌ క్యాప్‌ను దెబ్బతీసినట్లు నిపుణులు విశ్లేషించారు. 

మరిన్ని వార్తలు