లాభాలకు బ్రేక్‌.. 

23 Jan, 2019 00:31 IST|Sakshi

సెన్సెక్స్‌ 134 పాయింట్లు, నిఫ్టీ 39 పాయింట్లు డౌన్‌

మెటల్, ఫైనాన్షియల్స్, ఆటో స్టాక్స్‌లో లాభాల స్వీకరణ  

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌ అయిదు రోజుల లాభాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. మెటల్స్, ఫైనాన్షియల్స్, ఆటోమొబైల్‌ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ప్రధాన సూచీలు నష్టపోయాయి. 2019– 2020లో ప్రపంచ దేశాల వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కుదించడంతో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు రావడం కూడా ఇందుకు కారణం. సెన్సెక్స్‌ 134 పాయింట్లు క్షీణించి 36,445 పాయింట్లు, నిఫ్టీ 39 పాయింట్లు తగ్గి 10,923 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. బ్లూచిప్‌ కంపెనీల క్యూ3 ఫలితాలు అంచనాలకన్నా మెరుగ్గా ఉండటంతో మార్కెట్లో సెంటిమెంట్‌ సానుకూలంగా ఉన్నప్పటికీ.. ఇటీవలి ర్యాలీ అనంతరం ఇన్వెస్టర్లు కొంత లాభాల స్వీకరణకు దిగినట్లు విశ్లేషకులు    తెలిపారు.  

ప్రపంచ వృద్ధిపై ఐఎంఎఫ్‌ అంచనాలు కుదించిన నేపథ్యంలో ఆసియన్‌ మార్కెట్ల బాటలోనే భారత సూచీలు కూడా స్పందించాయని ఆషికా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ (ఈక్విటీ రీసెర్చ్‌ విభాగం) పారస్‌ బోత్రా చెప్పారు. ‘భారత అంచనాలను యథాతథంగానే ఉంచినప్పటికీ ద్రవ్య లోటును కట్టడి చేయడంపై ఐఎంఎఫ్‌ సందేహాలు వ్యక్తం చేసింది. మిగతా రంగాలన్నింటిపైనా ఒత్తిడి ఉన్నప్పటికీ రూపాయి బలహీనంగా ఉండటం .. ఐటీ, ఫార్మా స్టాక్స్‌లకు లాభించింది‘ అని ఆయన చెప్పారు. మంగళవారం దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఊతంతో ఒక దశలో 36,650 పాయింట్లకు పెరిగినప్పటికీ.. ఇటీవల అవుట్‌పెర్ఫార్మ్‌ చేసిన స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఆ తర్వాత 36,283 పాయింట్లకు కూడా పడిపోయింది. చివరికి 0.37 శాతం నష్టపోయి 36,645 వద్ద క్లోజయ్యింది.   

మెటల్స్‌ డౌన్‌.. 
లోహాల వినియోగంలో టాప్‌లో ఉండే చైనా వృద్ధి 28 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన దరిమిలా మెటల్స్‌కు డిమాండ్‌ తగ్గొచ్చన్న అంచనాలతో లండన్‌ మెటల్‌ ఎక్సే్చంజీలో (ఎల్‌ఎంఈ) పలు బేస్‌ మెటల్స్‌ ధరలు క్షీణించాయి. ఈ పరిణామాలతో దేశీయంగా మెటల్‌ స్టాక్స్‌ ఏకంగా 4 శాతం దాకా క్షీణించాయి. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ 4.53 శాతం, వేదాంత 3.50 శాతం, టాటా స్టీల్‌ 3.13 శాతం మేర పడ్డాయి. హిందుస్తాన్‌ జింక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో తదితర స్టాక్స్‌ 2.76 శాతం – 1.88 శాతం మేర క్షీణించాయి. దీంతో మెటల్‌ సూచీ 2.31 శాతం పడింది.  సెన్సెక్స్‌లో ఇతరత్రా ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్‌ పెయింట్‌ మొదలైన సంస్థల షేర్లు 3 నుంచి 0.99 శాతం దాకా తగ్గాయి. కోటక్‌ బ్యాంక్, బజాజ్‌ ఫైనాన్స్‌ మొదలైనవి లాభాల్లో ముగిసి.. సెన్సెక్స్‌ క్షీణతకు కొంత అడ్డుకట్ట వేశాయి. నిఫ్టీ ఇంట్రాడేలో 10,950–10,864 పాయింట్ల మధ్య తిరుగాడింది.  

సన్‌ ఫార్మా 5 శాతం జూమ్‌..
వివాదాస్పద ఆదిత్య మెడిసేల్స్‌ను తప్పించి ఆ స్థానంలో ఫార్ములేషన్స్‌ పంపిణీ వ్యాపారాన్ని అనుబంధ సంస్థకు బదలాయించనున్నట్లు సన్‌ ఫార్మా తెలిపింది. అలాగే, గ్రూప్‌ సంస్థల ఆడిటర్లను మార్చుతున్నట్లు, అట్లాస్‌ గ్లోబల్‌ ట్రేడింగ్‌తో రూ. 2,238 కోట్ల వివాదాన్ని సెటిల్‌ చేసుకున్నట్లు పేర్కొంది. దీంతో సంస్థ షేరు సుమారు 5 శాతం పెరిగి రూ. 418 వద్ద క్లోజయ్యింది.   

>
మరిన్ని వార్తలు