నిఫ్టీ 50లో వీక్లీ ఆప్షన్లు

19 Dec, 2018 01:28 IST|Sakshi

ఆమోదం తెలిపిన సెబీ

ప్రతి గురువారం ఎక్స్‌పైరీ

ఈ నెల 21 నుంచి సెన్సెక్స్‌లో వీక్లీ ఆప్షన్లు  

న్యూఢిల్లీ: నిఫ్టీ–50 సూచీలో వీక్లీ ఆప్షన్లకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. దీంతో ట్రేడర్లకు తమ పోర్ట్‌ఫోలియో నష్టభయాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించుకోవడానికి తాజాగా మరో హెడ్జింగ్‌ టూల్‌ లభించనున్నది. మరోవైపు సెన్సెక్స్‌కు సంబంధించిన వీక్లీ ఫ్యూచర్స్, ఆప్షన్ల కాంట్రాక్టులను ఈ నెల 21 నుంచి అందుబాటులోకి తేనున్నామని బీఎస్‌ఈ తెలిపింది.  
ప్రతి గురువారం ఎక్స్‌పైరీ... నిఫ్టీ 50 సూచీ వీక్లీ ఆప్షన్లకు ట్రేడర్లు, ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉండనుందో ప్రస్తుతం మదింపు చేస్తున్నామని ఎన్‌ఎస్‌ఈ ఎమ్‌డీ సీఈఓ విక్రమ్‌ లిమాయే తెలిపారు. నిఫ్టీ వీక్లీ ఆప్షన్లకు ఎప్పటి నుంచి అందుబాటులోకి తెచ్చేది త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఏడు వరుస వారాల వీక్లీ ఆప్షన్లు అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. ఈ వీక్లీ ఆప్షన్లు ప్రతి గురువారం ఎక్స్‌పైరీ అవుతాయని పేర్కొన్నారు. ఒకవేళ గురువారం మార్కెట్‌కు సెలవు రోజు అయితే, అంతకు ముందటి ట్రేడింగ్‌ రోజును ఎక్స్‌పైరీ డేగా పరిగణిస్తారు. ప్రస్తుతమున్న మూడు నెలల, మూడు క్వార్టర్లు, ఎనిమిది సెమీ–యాన్యువల్‌ ఆప్షన్‌ కాంట్రాక్టులు కొనసాగుతాయని వివరించారు. నిఫ్టీ బ్యాంక్‌ సూచీలో వీక్లీ ఆప్షన్లకు మంచి స్పందన లభిస్తోందని, దీంతో నిఫ్టీ 50 సూచీలో కూడా వీక్లీ ఆప్షన్లకు డిమాండ్‌ పెరిగిందని పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు