కన్సాలిడేషన్ బాటలో మార్కెట్

16 Nov, 2014 23:48 IST|Sakshi
కన్సాలిడేషన్ బాటలో మార్కెట్

ఈ వారం ట్రెండ్‌పై స్టాక్ నిపుణుల అంచనాలు
విదేశీ అంశాలు, ఎఫ్‌ఐఐలపై దృష్టి

 
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపగల దేశీ అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం స్థిరీకరణ(కన్సాలిడేషన్)కు అవకాశముందని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. గడిచిన వారంలో 0.6% లాభాలతో పురోగమించడం ద్వారా మార్కెట్ సరికొత్త రికార్డులను సాధించిన నేపథ్యంలో ఇకపై కూడా సానుకూలంగానే కదలవచ్చునని అంచనా వేశారు. శుక్రవారం(14న) మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 28,047 వద్ద, నిఫ్టీ  8,390 వద్ద ముగియడం ద్వారా కొత్త రికార్డులను నమోదు చేశాయి. వారం మొత్తంలో సెన్సెక్స్ 178, నిఫ్టీ 53 పాయింట్ల చొప్పున పుంజుకున్నాయి.

చమురు ధరలు, డాలర్ ఎఫెక్ట్
దేశీయంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 24 నుంచి మొదలుకానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షను డిసెంబర్ 2న చేపట్టనుంది. ఇప్పటికే ఐదేళ్ల కనిష్టానికి జారిన చమురు ధరలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు సెంటిమెంట్‌కు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే డాలరుతో రూపాయి మారకం విలువ 62 స్థాయికి జారడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. సోమవారం(17న) జపాన్ క్యూ3 తొలి జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. బుధవారం(19న) యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్ చివరినాటి పాలసీ సమావేశ వివరాలు వెల్లడికానున్నాయి.

సంస్కరణలపై దృష్టి: ప్రభుత్వం చేపట్టనున్న తదుపరి సంస్కరణలు, ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, విదేశీ పెట్టుబడులు వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని కొటక్ సెక్యూరిటీస్ వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. మార్కెట్లు కొత్త గరిష్టాలను తాకిన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇన్వెస్టర్లకు సూచించారు. ఇకపై మార్కెట్ స్థిరీకరణ బాటపడుతుందని, ఆపై తిరిగి మరింత పుంజుకుంటుందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ సానుకూలంగానే కదులుతుందని, సమీప కాలంలో ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 8,500 పాయింట్లను అధిగమించే అవకాశముందనేది ఏంజెల్ బ్రోకింగ్ అంచనా.

మరిన్ని వార్తలు