మాల్యా అప్పగింతపై నేడు బ్రిటన్‌ కోర్టు తీర్పు

10 Dec, 2018 03:12 IST|Sakshi

లండన్‌:  రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సోమవారం (నేడు) తీర్పును వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన అప్పగింతకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం భావించిన పక్షంలో తుదినిర్ణయం తీసుకునేందుకు ఈ కేసును బ్రిటన్‌ హోంశాఖకు పంపవచ్చని న్యాయనిపుణులు జైవాలా అండ్‌ కో మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ పావని రెడ్డి తెలిపారు. ప్రతికూల ఉత్తర్వులు వచ్చిన పక్షంలో ఇరు వర్గాలు (మాల్యా, భారత ప్రభుత్వం) 14 రోజుల్లోగా హైకోర్టులో అప్పీలు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అప్పీలు చేసుకోకపోతే 28 రోజుల్లోగా మేజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు అమల్లోకి (ప్రభుత్వం కూడా ఏకీభవిస్తే) వస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంతో మూతబడిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం తీసుకున్న దాదాపు రూ. 9,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టిన మాల్యా .. బ్రిటన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా ఆయన్ను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మరిన్ని వార్తలు