భారతీయులకు బంగారం.. మరీ స్పెషల్‌!!

4 Aug, 2017 01:32 IST|Sakshi
భారతీయులకు బంగారం.. మరీ స్పెషల్‌!!

►  ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ తగ్గినా మన దగ్గర పెరుగుదల
► ఏప్రిల్‌ – జూన్‌ నెలల్లో డిమాండ్‌పై ప్రపంచ పసిడి మండలి నివేదిక
► గ్లోబల్‌ డిమాండ్‌ 10 శాతం డౌన్‌
► దేశంలో 37 శాతం పెరుగుదల  


న్యూఢిల్లీ: బంగారంపై భారతీయులకున్న మోజు మరోసారి లెక్కలతో సహా బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) పుత్తడికి డిమాండ్‌ పడిపోతే... ఇక్కడ మాత్రం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కాలంలో డిమాండ్‌ 10 శాతం పడిపోయి 1,055.6 టన్నుల నుంచి 953 టన్నులకు చేరింది. ఇదే కాలంలో దేశంలో డిమాండ్‌ భారీగా 37 శాతం పెరిగి 122.1 టన్నుల నుంచి 167.4 టన్నులకు ఎగిసింది. ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తాజాగా ‘గోల్డ్‌ ట్రెండ్స్‌’పై తన నివేదికను విడుదల చేసింది. ముఖ్యాంశాలను చూస్తే..

దేశంలో పరిస్థితి ఇదీ...
♦ భారత్‌లో పసిడి డిమాండ్‌ పెరగడానికి గ్రామీ ణ ఆర్థిక సెంటిమెంట్‌ పెరగడం ఒక కారణం.
♦  విలువ రూపంలో చూస్తే డిమాండ్‌ 32 శాతం ఎగిసి రూ. 33,090 కోట్ల నుంచి రూ. 43,600 కోట్లకు ఎగిసింది.
♦  రెండవ త్రైమాసికంలో పెరిగినా, ఐదేళ్ల సగటుకన్నా తక్కువ కావడం గమనార్హం.
♦ ఇక ఆభరణాలకు డిమాండ్‌ 41 శాతం పెరుగుదలతో 89.8 టన్నుల నుంచి రూ. 126.7 టన్నులకు చేరింది. విలువ రూపంలో ఆభరణాలకు డిమాండ్‌ 36 శాతం పెరిగి రూ.24,350 కోట్ల నుంచి రూ.33,000 కోట్లకు ఎగిసింది.
♦ ఇక పెట్టుబడులకు సంబంధించి డిమాండ్‌ 26 శాతం పెరిగి 32.3 టన్నుల నుంచి రూ.40.7 టన్నులకు చేరింది. విలువ రూపంలో 21 శాతం పెరుగుదలతో రూ. 8,740 కోట్ల నుంచి రూ.10,610 కోట్లకు ఎగిసింది.
♦ ఇక గోల్డ్‌ రీసైకిల్‌ భారత్‌లో 23.8 టన్నుల నుంచి 29.6 టన్నులకు ఎగిసింది.
♦ ప్రస్తుత సంవత్సరం మొత్తంగా డిమాండ్‌ 650 టన్నుల నుంచి 750 టన్నుల మధ్య నమోదవుతుందని వరల్డ్‌ కౌన్సిల్‌ భావిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈటీఎఫ్‌ల బలహీనత
ప్రపంచవ్యాప్తంగా రెండవ త్రైమాసికంలో డిమాండ్‌ పడిపోవడానికి ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లోకి నిధుల మందగమనం ప్రధాన కారణం. ఇన్వెస్ట్‌మెంట్‌ డిమాండ్‌ 34 శాతం పడిపోయి 450 టన్నుల నుంచి 297 టన్నులకు పడిపోయింది. ఆభరణాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ మాత్రం 447 టన్నుల నుంచి 481 టన్నులకు చేరింది. సెంట్రల్‌ బ్యాంకుల డిమాండ్‌ 20 శాతం పెరిగి 78 టన్నుల నుంచి 94 టన్నులకు చేరింది.

మరిన్ని వార్తలు