జీఎస్‌టీలో స్పష్టత ఏదీ?

14 Jul, 2018 02:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వచ్చి ఏడాది దాటింది. ఇతర రంగాల్లో ఏమో కానీ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మాత్రం జీఎస్‌టీ అమలులో స్పష్టత లోపించిందని నిపుణులు చెబుతున్నారు. స్పష్టత కొరవడిన అంశాలేంటంటే..

ఫ్లాట్లను రద్దు చేసుకుంటే: జీఎస్‌టీ అమలు కంటే ముందు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లో ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన కొనుగోలుదారునికి జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ఆ ఫ్లాట్‌ను రద్దు చేస్తే గనక సదరు కస్టమర్‌కు జీఎస్‌టీ ముందు చెల్లించిన సర్వీస్‌ ట్యాక్స్‌ తిరిగి రాదు. ఇందుకు సంబంధించి జీఎస్‌టీలో ఎలాంటి నిబంధన లేదు.
స్టాంప్‌ డ్యూటీ: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే స్టాంప్‌ డ్యూటీని జీఎస్‌టీ పరిధిలోకి చేర్చాలని సూచించారు. ఇదే గనక జరిగితే ఏ రాష్ట్రంలో ప్రాపర్టీని కొనుగోలు చేసినా సరే గృహ కొనుగోలుదారులు ఒకే రకమైన పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
అభివృద్ధి హక్కుల బదిలీ: అభివృద్ధి హక్కుల బదిలీ (ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌– టీడీఆర్‌) అనేవి భూమి, భవనాలకు సంబంధించిన హక్కులు. అయితే జీఎస్‌టీలో భూమికి సంబంధించిన టీడీఆర్‌ మినహాయింపునిచ్చారు. ఒకవేళ జీఎస్‌టీలో టీడీఆర్‌ను చేర్చినట్టయితే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) వర్తింస్తుందా? లేదా? అనేది స్పష్టత లేదు.

నిర్మాణాలపై 12 శాతం జీఎస్‌టీ..
నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లకు 12 శాతం జీఎస్‌టీ కేటాయించారు. ఈ తరహా నిర్మాణాలకు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కూడా వర్తిస్తుంది. 60 చ.మీ. వరకు కార్పెట్‌ ఏరియా ఉన్న ప్రాజెక్ట్‌లకు మాత్రం 8 శాతం జీఎస్‌టీని విధించారు. నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీలకు జీఎస్‌టీ వర్తించదు. పన్ను కేటాయింపుల్లో ఒకే రకమైన జీఎస్‌టీ ఉంది కానీ, అంతిమ ధర నిర్ణయం విషయంలో ఒకే విధానం లేదు. నిర్మాణం స్థాయి, ప్రాజెక్ట్‌ తీరు, వసతులను బట్టి ధర నిర్ణయించబడుతుంది.    

>
మరిన్ని వార్తలు