అద్దె వస్తుంటే పన్ను కట్టాలి మరి!

23 Nov, 2015 03:37 IST|Sakshi

ఒక ఇల్లు మీ పేరిట ఉంది. దాని మీద వచ్చే ఆదాయాన్ని ‘ఇంటి మీద ఆదాయం’ అని పిలుస్తారు. అది మీ ఖాతాలో పడుతుంది. సూటిగా చెప్పాలంటే... ఇల్లు అద్దెకు ఇవ్వడం వలన వచ్చే ఆదాయం పన్ను భారానికి గురవుతుంది. విదేశాల్లో ఉన్న ఇంటి మీద ఆదాయం మీరు రెసిడెంట్ అయితే పన్నుకి గురవుతుంది. యజమానే పన్ను కట్టాలి.
 
యజమాని అంటే...
ఆస్తి ఎవరి పేరిట ఉందో వారే యజమాని. పేరు మీద లేకపోయినా అద్దె తీసుకునే హక్కు ఉన్న వ్యక్తి కూడా యజమానే. అంతే కాకుండా ప్రతిఫలం తీసుకోకుండా ఇంటిని బదిలీ చేసినప్పుడు.. బదిలీ చేసిన వ్యక్తినే యజమాని అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక పెద్ద మనిషి పాతిక లక్షల నగదు భార్యకిచ్చాడు. ఆ భార్య ఆ నగదుతో ఇల్లు కట్టి అద్దెకిచ్చింది.

ఆ అద్దెని ఆదాయంగా పరిగణించడానికి పెద్ద మనిషే యజమాని. సహకార సంస్థలు ఎలాట్ చేసినప్పుడు మెంబరే యజమాని అవుతాడు. ఒక వ్యక్తి మరో వ్యక్తికి 10 లక్షలు ఇచ్చి ఇల్లు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇల్లు అద్దెకిచ్చాడు. అద్దె వస్తోంది. రిజిస్ట్రేషన్ జరగ లేదు. అయితే ఇక్కడ 10 లక్షలు ఇచ్చిన వ్యక్తే యజమాని. అలాగే ఇంటిని 12 సంవత్సరాలకు పైగా లీజుకు ఇస్తే.. ఇల్లు అనుభవిస్తున్న వ్యక్తి యజమాని అవుతాడు. జాయింట్‌గా హక్కులుంటే... హద్దులు స్పష్టంగా ఉంటే.. జాయింట్ ఓనర్లుగా పరిగణిస్తారు.
 
అద్దెను ఎలా నిర్వచిస్తాం...
అద్దె అంటే మీ చే తికి వచ్చింది అని చెప్పొచ్చు. సమంజసంగా ఉండాలి. మరీ తక్కువగా చూపిస్తే అధికారులు ఒప్పుకోరు. అలా మదించిన  అద్దెలో నుంచి కిరాయిదారు చెల్లించిన మున్సిపల్ పన్నులు, రిపేర్లు, బ్రోకరేజ్, కమీషన్ తదితర వాటికి మినహాయింపు ఇవ్వరు. తిరిగి ఇవ్వాల్సిన డిపాజిట్ అద్దె కాదు.

ఇవ్వనవసరం లేని డిపాజిట్‌ను లీజు వ్యవధికి సర్దుబాటు చేసి అద్దెగా పరిగణిస్తారు. ఫర్నిచర్, సెట్టింగ్స్ తదితర వాటిని కలిపి అద్దెకిస్తే.. రెండింటినీ విడగొట్టాలి. ఇంటి అద్దెకాని భాగాన్ని ఇతర ఆదాయంగా పరిగణిస్తారు.
 
ఇంటి అద్దెలో నుంచి తగ్గింపులు
అద్దెలో నుంచి యజమాని చెల్లించిన స్థానిక పన్నులు తగ్గిస్తారు. ఇక్కడ చెల్లించినట్లు రుజువులు కావాలి. మిగిలిన మొత్తంలో నుంచి 30% స్టాండర్డ్ డిడక్షన్‌గా మినహాయిస్తారు. ఈ మినహాయింపునకు ఎటువంటి రుజువులు అవసరం లేదు.  

రుణాల మీద వడ్డీకి మినహాయింపు ఉంది. ఇటువంటి వడ్డీ మీద ఎటువంటి పరిమితులు లేవు. రుణాలు ఎవరి దగ్గరి నుంచైనా తీసుకోవచ్చు. ముందు రుణం చెల్లించడానికి మరో రుణం తీసుకుంటే రెండవ రుణం మీద వడ్డీ తగ్గిస్తారు. సొంత ఇంటి మీద ఆదాయం అంటే మీ ఇంట్లో మీరు ఉండటం. దీనివల్ల ఎటువంటి అద్దె రాదు. ఎటువంటి మినహాయింపులు కానీ, తగ్గింపులు కానీ ఉండవు. కానీ రుణం మీద వడ్డీకి మినహాయింపు ఉంటుంది.

01/04/1999 త ర్వాత తీసుకున్న రుణాల మీద వడ్డీ రూ.2,00,000 వరకు తగ్గిస్తారు. రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి 3 ఏళ్లలోపు ఇల్లు పూర్తి అవ్వాలి. 01/04/1999కి ముందు తీసుకున్న రుణాల మీద వడ్డీ కేవలం రూ.30,000 వరకు మాత్రమే మినహాయిస్తారు. ఇల్లు పూర్తి కావడానికి ముందు చెల్లించిన వడ్డీని ఇల్లు పూర్తయిన తర్వాత 5 సమాన భాగాలుగా ఐదేళ్లు మినహాయిస్తారు. ఇంటి అద్దె కన్నా వడ్డీ ఎక్కువగా ఉంటే దాన్ని నష్టం అంటారు. ఈ నష్టాన్ని మీ ఇతర ఆదాయంలో నుంచి తగ్గిస్తారు.
 
ముఖ్యాంశాలు ఇవీ...
* మున్సిపల్ పన్నులు చెల్లించండి. రశీదులు భద్రపరచుకోండి.
* అద్దెను ఫర్నిచర్, సెట్టింగ్స్‌గా విడగొట్టండి.
* నెలసరి రూ.15,000 లోపు ఉంటే టీడీఎస్ బాధ్యతలు ఉండవు.
* ఫ్లాట్లలో మెయింటెనెన్స్ ఉంటుంది. దీనిని కిరాయిదారును డెరైక్ట్‌గా ఇవ్వమనండి. అద్దెలో కలపకండి. అప్పుడు మీ చేతికి వచ్చిన మొత్తాన్ని మాత్రమే ఆదాయంగా తీసుకోవచ్చు.
* ఇంటి రుణం సంస్థల నుంచి తీసుకుంటే  అన్ని కాగితాలు ఉండాలి. ఇతరుల నుంచి తీసుకుంటే జాగ్రత్త వహించండి.
* వరకట్నం నేరం. తీసుకోవద్దు. కానీ పుట్టింటి వారిచ్చిన నగదు, ఇతర ధనాన్ని స్త్రీ ధనంగా పరిగణిస్తారు. దీన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయించండి. ఆ మొత్తాన్ని చెక్కు ద్వారా అప్పు తీసుకొని ఇంటి మీద ఖర్చుపెట్టండి. వడ్డీ ఇవ్వండి. వడ్డీని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ భాగస్వామికి ఏ ఇతర ఆదాయం లేకపోతే వడ్డీ మీద రూ.2,50,000 వరకు ఎటువంటి పన్నుభారం ఉండదు.
 
 కె.సీహెచ్ ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి,
 కె.వి.ఎన్ లావణ్య
 ట్యాక్సేషన్ నిపుణులు

మరిన్ని వార్తలు