‘యస్‌ బ్యాంక్‌’ అసలు ఏం జరిగింది?

7 Mar, 2020 16:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఐదవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌ ‘యస్‌’ బ్యాంక్‌ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం గురువారం తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశంలో బ్యాంకుల కార్యకలాపాలను క్రమబద్ధీకరించే భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ప్రత్యక్షంగా కార్యాచరణలోకి దిగి ‘యస్‌’ బ్యాంక్‌ నిర్వహణా బోర్డును రద్దు చేయడంతోపాటు కొత్త సీఈవోను నియమించింది. డిపాజిట్‌దారుల విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు విధించింది. వైద్యం ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులకు మినహా నెలవారిగా ఖాతాదారులు 50 వేల రూపాయలకు మించి విత్‌ డ్రా చేసుకోవడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించింది. ('యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని దోచేశారు')

నిరర్థక ఆస్తులు పెరగిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోతున్న యస్‌ బ్యాంక్‌ రక్షణకు ఆర్బీఐ శుక్రవారం ఓ వ్యూహాన్ని ప్రకటించింది. ఆ బ్యాంక్‌లోని 49 శాతం షేర్లను ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ‘ఎస్‌బీఐ’ కొనుగోలు చేయడమే ఆ వ్యూహం. దేశ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా కుదేలైన నేటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులే నిరర్థక ఆస్తులతో సతమతమవుతున్నాయి. అందుకనే ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటినీ విలీనం చేయాలనే ప్రతిపాదనను కేంద్రం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. (యస్ బ్యాంకు సంక్షోభం)

ఎస్‌బీఐ నుంచి 11,760 కోట్లు
యస్‌ బ్యాంక్‌లో పది రూపాయలకు ఓ షేర్‌ చొప్పునా 49 శాతం షేర్లు కొనాలంటే ఎస్‌బీఐకి 11,760 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అయినప్పటికీ అది ప్రభుత్వరంగ బ్యాంక్‌ అనిపించుకోదు. బ్యాంక్‌లో షేర్‌ హోల్డర్లకు వాటాను 11 శాతానికి పరిమితం చేస్తామని, మిగతా నలభై శాతం షేర్లు సంస్థల చేతుల్లో ఉంటాయని కేంద్రం చెబుతోంది. ఓ సంస్థగా ఎల్‌ఐసీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. (యస్బీఐ..!)

2004లో ప్రారంభమైన బ్యాంక్‌...
2004లో ప్రారంభమైన యస్‌ బ్యాంక్‌ పారిశ్రామికవేత్తలకు ఉదారంగా అప్పులు ఇవ్వడం ద్వారా అనతికాలంలోనే అభివద్ధి చెందింది. 2008లో బ్యాంక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు మరణించడం, బ్యాంక్‌ ప్రమోటర్‌గా రాణా కపూర్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బ్యాంక్‌ పతనం ప్రారంభమైందని ఆర్థిక నిపుణుల అంచనా. ఏ ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాలు పుట్టని పారిశ్రామిక సంస్థలు చాలా సులభంగా ఈ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నాయి. ఆ సంస్థలో సకాలంలో వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంక్‌ నిరర్థక ఆస్తులు 7.4 శాతానికి చేరుకున్నాయి. (రాణా కపూర్ నివాసంలో ఈడీ సోదాలు)

యస్‌ బ్యాంక్‌ నుంచి కేఫ్‌ కాఫీడే, సీజీ పవర్, జెట్‌ ఏర్‌వేస్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్, అనిల్‌ అంబానీ రిలయెన్స్‌ ఇన్‌ఫ్రా, సుభాష్‌ చంద్ర ఎస్సెల్‌ గ్రూప్‌ భారీ ఎత్తున రుణాలు తీసుకన్నాయి. ఫిబ్రవరి ఒకటవ తేదీలోగా ఈ సంస్థలు బ్యాంక్‌కు వడ్డీ చెల్లించాల్సి ఉండగా దాదాపు అన్నీ విఫలమయ్యాయి. ఒక అంబానీ కంపెనీయే 30 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా చెల్లించలేదని తెల్సింది.  దేశ ప్రధానికి అంబానీ, సుభాష్‌ చంద్రలు మంచి మిత్రులనే ప్రచారం పారిశ్రామిక వర్గాల్లో ఉందన్న విషయం తెల్సిందే. (ఆర్థికమంత్రి భరోసా : షేరు రికవరీ)

యుద్ధ విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేకపోయినా 2015లో రఫేల్‌ జెట్‌ యుద్ధ విమానాల సరఫరాకు ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏవియేషన్‌తో కలసి ఉమ్మడిగా అనిల్‌ అంబానీ కాంట్రాక్ట్‌ పొందిన విషయం తెల్సిందే. ఈ దశలో యస్‌ బ్యాంక్‌ మూత పడినా, పారిశ్రామికవేత్తల ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ చేసినా వారు, వారి సంస్థలు కోలుకోవడం కష్టం. బ్యాంకులో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ, కెనడాకు చెందిన అత్యంత ధనవంతుడు ఎర్విన్‌ సింగ్‌ బ్రాయిచ్‌ ముందుకు వచ్చారని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. వారెవ్వరు ముందుకు రానప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నది కోటి రూకల ప్రశ్న? (యస్వాటాల కొనుగోలుకు ఎస్బీఐ ఆమోదం)

మరిన్ని వార్తలు