అంబానీ చేయివేస్తే...

13 Feb, 2018 18:47 IST|Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచంలోని ఆయా దేశాల్లో అత్యంత సంపన్నులు తమ సొమ్ముతో ప్రభుత్వాలను ఎన్ని రోజులు నడిపించగలరని లెక్కలు తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. బ్లూమ్‌బర్గ్‌ రాబిన్‌హుడ్‌ ఇండెక్స్‌ 2018 ప్రకారం సంపన్నుల నికర ఆస్తులు, ఆయా దేశాల ప్రభుత్వాల రోజువారీ వ్యయంతో లెక్కగట్టి ఈ విశ్లేషణ చేపట్టారు. భారత్‌లో అత్యంత సంపన్నుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తన సంపదతో 20 రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపించగలరని వెల్లడైంది. సైప్రస్‌లో అత్యంత సంపన్నుడైన జాన్‌ ఫ్రెడ్రిక్సన్‌ ఏకంగా 441 రోజుల పాటు తమ ప్రభుత్వ ఖర్చులను గట్టెక్కించగలరని తేలింది.

సైప్రస్‌లో తక్కువ జనాభా, పరిమిత వ్యయం ఉండటంతో సర్కార్‌ నిర్వహణ ఖర్చులు అక్కడ తక్కువగా ఉండటం గమనార్హం. ఇక జపాన్‌, పోలాండ్‌, అమెరికా, చైనాలో దిగ్గజ సంపన్నులకూ తమ ప్రభుత్వాలను ఈదడం అత్యంత క్లిష్టమైన వ్యవహారమే. చైనాలో అలీబాబా అధినేత ప్రపంచంలోనే 16వ అత్యంత సంపన్నుడు జాక్‌మా తన సంపదతో డ్రాగన్‌ సర్కార్‌ను కేవలం నాలుగు రోజుల పాటే నడిపించగలరు.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అమెరికా ప్రభుత్వాన్ని కేవలం అయిదు రోజులే ఆదుకోగలరని రాబిన్‌హుడ్‌ ఇండెక్స్‌ విశ్లేషిస్తే వెల్లడైంది. బ్రిటన్‌ సంపన్నుడు హ్యూ గ్రొస్‌వెనార్‌, జర్మనీలో డైటర్‌ స్కార్జ్‌లూ అపార సంపదతోనూ కొద్ది గంటలు మాత్రమే తమ ప్రభుత్వాలను ఆదుకోగలరు. 

మరిన్ని వార్తలు