ఒకటైన వాట్సాప్‌, జియో.. ఎందుకంటే?

26 Sep, 2018 13:57 IST|Sakshi
జియోఫోన్‌, వాట్సాప్‌ (ఫైల్‌ ఫోటో)

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సాప్‌, టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో ఒక్కటయ్యాయి. భారత్‌లో నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా ఈ  రెండు కంపెనీలు ఇక నుంచి కలిసి పనిచేస్తున్నాయి. జియోఫోన్‌, జియోఫోన్‌ 2లో ఈ చాట్‌ యాప్‌కు అనుమతించిన రిలయన్స్‌ జియో, నకిలీ మెసేజ్‌లు, రూమర్లు వ్యాప్తి చెందకుండా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. జియోఫోన్‌ కొత్త యూజర్లకు వాట్సాప్‌  కూడా ఎడ్యుకేషన్‌ మెటీరియల్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఫార్వర్డ్‌ వాట్సాప్‌ మెసేజ్లను గుర్తించడం ఎలా? అవసరమైన మెసేజ్‌లను షేర్‌ చేయడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తోంది. 

నకిలీ మెసేజ్‌లు నిరోధించడంపై అవగాహన కల్పిస్తూ... వాట్సాప్‌ ఈ ఎడ్యుకేషనల్‌ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. జియోతో తాము కలిసి పనిచేస్తున్నామని, తమ ఎడ్యుకేషన్‌ క్యాంపెయిన్‌ను కొనసాగిస్తామని వాట్సాప్‌ అధికార ప్రతినిధి కార్ల్‌ వూగ్‌ చెప్పారు. కాగా, వాట్సాప్‌, సోషల్‌ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న నకిలీ మెసేజ్లతో మూక దాడులు జరిగి, దాదాపు 30 మందికి పైగా వ్యక్తులు చనిపోయారు. వాట్సాప్‌ ద్వారా కొన్ని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో మైనార్టీలను టార్గెట్‌ చేశారని పోలీసులు చెప్పారు. నకిలీ మెసేజ్‌లను నిర్మూలించడానికి వెంటనే వాట్సాప్‌ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా యూజర్లకు అవగాహన కల్పించడం కోసం ప్రింట్‌, రేడియో యాడ్‌ క్యాంపెయిన్లను, యాప్‌లో కొత్త ఫీచర్లను తీసుకురావడం, డిజిటల్‌ ఎంపవర్మెంట్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం వంటి వాటిని వాట్సాప్ చేపడుతోంది.       

మరిన్ని వార్తలు