వా(లే)ట్సాప్‌ పే..?

14 Nov, 2019 04:39 IST|Sakshi

వాట్సాప్‌ పేమెంట్‌ సేవలు ఇప్పట్లో రావేమో..!

ఆర్థిక లావాదేవీల వివరాల భద్రతపై సందేహాలు

ప్లాట్‌ఫామ్‌ను ఆడిట్‌ చేయనున్న ప్రభుత్వం, ఆర్‌బీఐగణనీయంగా తగ్గిన డౌన్‌లోడ్స్‌

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఇతర ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థలకు దీటుగా పేమెంట్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేట్లు కనిపించడం లేదు. యూజర్ల వివరాలను గోప్యంగా ఉంచడంలో వాట్సాప్‌ సామర్థ్యంపై నెలకొన్న సందేహాలే ఇందుకు కారణం. దీనికి తోడు.. ఇతరత్రా దేశీ చెల్లింపుల సంస్థలు, బ్యాంకులు పాటించే పారదర్శకతను ‘వాట్సాప్‌ పే’ పట్టించుకోకపోవడం అధికారులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

పైగా తమ యూజర్లు జరిపే ఆర్థిక లావాదేవీల వివరాలను నిబంధనల ప్రకారం భారత్‌లోనే భద్రపరుస్తోందా లేదా అన్న విషయాన్ని కూడా వాట్సాప్‌ సూటిగా చెప్పకపోతుండటం సంస్థ తీరుపై అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా చెల్లింపుల వ్యవస్థకు కీలకంగా మారుతున్న ఏకీకృత చెల్లింపుల వ్యవస్థను (యూపీఐ) వినియోగించడానికి వాట్సాప్‌నకు అనుమతులిచ్చిన పక్షంలో.. మొత్తం పేమెంట్స్‌ వ్యవస్థకే ముప్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖలు ఆందోళన చెందుతున్నాయి. కాబట్టి.. యూపీఐని వాడుకోవటానికి వాట్సాప్‌నకు అనుమతి ఇవ్వరాదని భావిస్తున్నాయి.  

ఆర్‌బీఐ విముఖత...
‘వాట్సాప్‌ పే’ లో యూజర్ల ఆర్థిక లావాదేవీల వివరాలకు భద్రత ఉండకపోవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం భావిస్తోంది. అందుకే భారత యూజర్ల డేటాను స్థానికంగానే భద్రపర్చాలన్న లోకలైజేషన్‌ నిబంధనను వాట్సాప్‌ పక్కాగా పాటిస్తేనే.. దేశవ్యాప్త పేమెంట్స్‌ సేవలకు అనుమతించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు (ఎన్‌పీసీఐ) ఆర్‌బీఐ స్పష్టంచేసింది. యూపీఐ విధానాన్ని రూపొందించిన ఎన్‌పీసీఐ... కొన్నాళ్లుగా వాట్సాప్‌ పే సేవలపై సానుకూలంగానే ఉంటున్నప్పటికీ.. ఆర్‌బీఐ సూచనలతో పరిస్థితి మారేట్లు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అసలు వాట్సాప్‌ యూజర్ల సమాచారానికి ఎంత మేర భద్రత ఉందన్న విషయాన్ని తేల్చుకునేందుకు ఆ సంస్థ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను సమగ్రంగా అధ్యయనం చేయాలన్న ఆలోచన కూడా వ్యక్తమవుతోంది. ఆర్‌బీఐ, ఐటీ శాఖ సంయుక్తంగా ఈ ఆడిట్‌ చేసే అవకాశాలున్నాయి. డేటా లోకలైజేషన్‌ విషయంలో ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాట్సాప్‌ పేమెంట్‌ సేవలను నడిపిస్తోందంటూ ఇప్పటికే ఒక స్వచ్ఛంద సంస్థ .. సుప్రీం కోర్టులో కేసు కూడా వేసింది. ప్రస్తుతం వాట్సాప్‌ పే ద్వారా చెల్లింపుల విధానం ప్రయోగాత్మక దశలో ఉంది. దీన్ని ఈ ఏడాదే పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలని వాట్సాప్‌ భావించినప్పటికీ .. తాజా పరిస్థితుల నేపథ్యంలో అది ఇప్పుడప్పుడే సాధ్యపడేలా లేదు. ప్రస్తుతం వాట్సాప్‌నకు భారత్‌లో దాదాపు 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.   

స్పైవేర్‌తో వాట్సాప్‌నకు కష్టాలు..
స్పైవేర్‌ ద్వారా యూజర్లపై నిఘా పెట్టేందుకు వాట్సాప్‌లో లొసుగులు కారణమవుతున్నాయన్న ఆరోపణలు సైతం కంపెనీకి సమస్యగా మారాయి. ఇటీవలే కొందరు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల సమాచారం బయటకు పొక్కిందనే వార్తలతో వాట్సాప్‌ భద్రతపై సందేహాలు అమాంతం పెరిగిపోయాయి. యూజర్ల డేటాను తస్కరించేందుకు ఉపయోగిస్తున్న పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌పై వాట్సాప్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ .. అమెరికాలో అధికారులకు ఫిర్యాదు కూడా చేసింది.

అయినప్పటికీ.. వాట్సాప్‌పై సందేహాలు నివృత్తి కాలేదు. భారత్‌లో వాట్సాప్‌ డౌన్‌లోడ్స్‌ ఏకంగా 80 శాతం పడిపోయాయి. మొబైల్‌ అనలిటిక్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ అధ్యయనం ప్రకారం స్పైవేర్‌ వివాదం బయటకు రాకముందు.. అక్టోబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 25 దాకా డౌన్‌లోడ్స్‌ 89 లక్షలుగా ఉన్నాయి. స్పైవేర్‌ వివాదం వచ్చాక  అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 3 మధ్యన ఇది 18 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో సిగ్నల్‌ అనే మరో మెసేజింగ్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌ 63 శాతం, టెలిగ్రాం డౌన్‌లోడ్స్‌ 10 శాతం పెరిగాయి.

కొనసా...గుతున్న వాట్సాప్‌ పే కథ..
► 2017 ఫిబ్రవరి: భారత్‌లో వాట్సాప్‌ చెల్లింపుల సేవలను ప్రారంభించ    నుందని తొలిసారిగా వార్తలు.
► 2017 జూలై: యూపీఐ ద్వారా సేవలకు ఎన్‌పీసీఐ నుంచి అనుమతులు
► 2018 ఫిబ్రవరి: ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి ప్రయోగాత్మకంగా సర్వీసులు ప్రారంభం. 10 లక్షల యూజర్లకు సేవలు. తాజాగా మొత్తం 40 కోట్ల యూజర్ల సేవలు విస్తరించేందుకు అనుమ
తుల కోసం యత్నాలు.

అమెరికాలో ఫేస్‌బుక్‌ పే సేవలు షురూ..  
ఒకవైపు వాట్సాప్‌ భారత్‌లో తమ పేమెంట్‌ సేవలను ప్రారంభించేందుకు నానా తంటాలు పడుతుండగా.. దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌ మాత్రం అమెరికాలో తమ సొంత పేమెంట్స్‌ విధానాన్ని ఆవిష్కరించింది. ఫేస్‌బుక్, మెసెంజర్‌తో పాటు తమ గ్రూప్‌లో భాగమైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లపైనా దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం.. నిధుల సమీకరణకు, ఇన్‌–గేమ్‌ కొనుగోళ్లు, ఈవెంట్‌ టికెట్ల కొనుగోళ్లు, మెసెంజర్‌ ద్వారా వ్యక్తులకు చెల్లింపులు జరిపేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. పేపాల్‌తో పాటు ప్రధాన క్రెడిట్, డెబిట్‌ కార్డులతో లావాదేవీలు నిర్వహించవచ్చు.

ఈ సర్వీసు వినియోగించుకోవాలంటే.. సెటింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌బుక్‌ పే ఆప్షన్‌ను ఎంచుకుని, పేమెంట్‌ చేసే విధానాన్ని సెలెక్ట్‌ చేయాలి. ఆ తర్వాత నుంచి ఫేస్‌బుక్‌ పే ద్వారా నేరుగా చెల్లింపులు జరపవచ్చు. 2015లో విరాళాల సేకరణకు దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పట్నుంచి ఇప్పటిదాకా 2 బిలియన్‌ డాలర్ల పైగా విరాళాలను ప్రాసెస్‌ చేసినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. యూజర్ల వివరాల గోప్యతకు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
 

మరిన్ని వార్తలు