వాట్సాప్‌ షాకిచ్చింది.. కేవలం ఐదు చాట్లకే..

20 Jul, 2018 11:10 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టివార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాట్సాప్‌లో అసత్య వార్తలు ప్రచారం కావడం వల్ల పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారని.. అటువంటి తప్పుడు సందేశాలు వైరల్‌ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్‌ను హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో వాట్సాప్‌ సైతం నకిలీ వార్తలు విజృంభించకుండా చూస్తున్నాయి. దానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాయి. వాట్సాప్‌ మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు పెద్ద మొత్తంలో ప్రచారం కాకుండా ఉండేందుకు వాట్సాప్‌ గట్టి చర్యలు తీసుకుంటోంది. శుక్రవారం జారీ చేసిన ప్రకటనలో.. వాట్సాప్‌లో ఫార్వర్డ్‌ అ‍య్యే టెస్ట్‌పై పరిమితి విధించినట్టు వాట్సాప్‌ ప్రకటించింది. కేవలం ఐదు చాట్లకు మాత్రమే మెసేజ్‌ ఫార్వర్డ్‌ అయ్యేలా నిర్దేశించింది. అదేవిధంగా మీడియా మెసేజ్‌లకు క్విక్‌ ఫార్వర్డ్‌ బటన్‌ను తీసేసింది. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల కంటే,  భారత్‌లోనే మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలు ఎక్కువగా ఫార్వర్డ్‌ అవుతున్నాయని వాట్సాప్‌ తెలిపింది.  ఒకేసారి మల్టిపుల్‌ చాట్లకు మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసుకునేలా వాట్సాప్‌ ఫీచర్‌ను కొన్నేళ్ల క్రితమే తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం పెద్ద ఎత్తున్న మెసేజ్‌లు ఫార్వర్డ్‌ అవుతూ... అనాగరిక ధోరణులు పెరుగుతుండటంతో, ఐదు చాట్లకు మాత్రమే మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఈ ఫార్వర్డ్‌ మెసేజ్‌లో ఓరిజినల్‌ ఏదో గుర్తించేందుకు వాట్సాప్‌ గత నెలలోనే ఫార్వర్డ్‌ లేబుల్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌ ఫార్వర్డ్‌ మెసేజ్‌లతో దేశంలో భారీ ఎత్తున దాడులు పెరుగుతుండటంతో, వాట్సాప్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కేంద్ర నోటీసులకు స్పందించిన వాట్సాప్‌, టెక్నాలజీని వాడుకుని, కొత్త ఫీచర్లతో ఫార్వర్డ్‌ మెసేజ్‌లను గుర్తిస్తామని, ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. 

మరిన్ని వార్తలు