వాట్సాప్ తగ్గించేసింది

30 Mar, 2020 11:52 IST|Sakshi

వాట్సాప్ కీలక మార్పు 

 స్టేటస్ వీడియోల నిడివి సగానికి తగ్గింపు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల వినియోగదారులను సొంతం చేసుకున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం  తీసుకుంది.  ముఖ్యంగా  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా  పుంజుకుంది.  దీంతో వాట్సాప్ స్టేటస్ లో అప్‌లోడ్ చేసే వీడియోల నిడివిని సగానికి కుదించింది. వాట్సాప్ వినియోగంలో వస్తున్న అంతరాయాన్ని నివారించే చర్యల్లో భాగంగా దీన్ని15 సెకన్లకు పరిమితం చేసింది. అంతకుముందు ఇది 30 సెకన్లు. వినియోగదారులు పెద్ద సంఖ్యలో వీడియోలను వీక్షిస్తున్న కారణంగా  ఇంటర్నెట్ వేగం ప్రభావితమవుతోందని వాట్సాప్ వెల్లడించింది.

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్  'స్టేటస్' సెక్షన్ కింద  షేర్ చేసే వీడియోల వ్యవధిని తగ్గించిందని వాబేటా ఇన్ఫో ట్విటర్ ద్వారా వెల్లడించింది.  తాజా నిర్ణయం ప్రకారం భారతీయ వినియోగదారులు ఇకపై 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే వీడియోలను వాట్సాప్ స్టేటస్ ద్వారా  షేర్ చేయలేరు.  15 సెకన్ల వ్యవధి ఉన్న వీడియోలు మాత్రమే అనుమతించబడతాయి. సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై ట్రాఫిక్ ను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయ తీసుకున్నామని వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్  స్టేటస్ లో పలు వీడియోలను, ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. వినియోగదారుల నెట్‌వర్క్‌లో ఉన్న వ్యక్తులకు  వీటిని వీక్షించే అవకాశం వుంది. అలాగే ఈ స్టేటస్ లో షేర్ చేసిన ఇమేజ్ లు, జిఫ్స్, లేదా వీడియోలు 24 గంటల తర్వాత ఆటోమేటిగ్గా అదృశ్యమవుతాయి. వాట్సాప్ స్టేటస్ ను ప్రారంభించినపుడు 90 సెకన్ల నుండి మూడు నిమిషాల వీడియోలను అనుమతించింది. ఆ తరువాత, దీన్ని 30 సెకన్లకు తగ్గించింది. భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు.

కాగా  కరోనా వైరస్ ( కోవిడ్ -19) మహమ్మారి ప్రకంపనల కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇంటికే పరిమితమైన ప్రజలు సమాచారం, వినోదం కోసం సోషల్ మీడియాపైన ఎక్కువ ఆధారపడుతున్నారు.  దీంతో ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వీడియో, యూట్యూబ్,  ఫేస్‌బుక్‌ లాంటి ఇతర సంస్థలు ఇంటర్నెట్ లైన్లను కాపాడటానికి వీడియో స్ట్రీమ్‌ల నాణ్యతను తగ్గించిన సంగతి తెలిసిందే. మరోవైపు లాక్ డౌన్ కొనసాగిస్తారన్న అంచనాలపై కేంద్రం స్పందించింది. ఏప్రిల్ 14 తరువాత కొనసాగించే ఆలోచన  ప్రస్తుతానికి  లేదని  కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు