వాట్సాప్‌ స్టేటస్‌తో సంపాదన

2 Nov, 2018 08:23 IST|Sakshi

ఒకటి కాదు.. రెండు కాదు.. పదేళ్లు! ప్రకటనలనేవి లేకుండా వాట్సాప్‌ నడిచిన కాలమిది! ఇకపై ఆ గ్యారెంటీ లేదు. ఎందుకంటారా? వాట్సాప్‌లోని స్టేటస్‌ సెక్షన్‌ను సంపాదనకు వాడుకోవాలని ఆ కంపెనీ నిర్ణయించింది! అదే అందులోనూ ప్రకటనల హోరు త్వరలోనే మొదలు కానుంది!

వెబ్‌సైటైనా.. మొబైల్‌ యాప్‌ అయినాసరే.. ప్రకటనలు తప్పనిసరన్నది తెలిసిన విషయమే. కాకపోతే చాటింగ్‌ యాప్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన వాట్సాప్‌ మాత్రం ఇందుకు భిన్నమనే చెప్పాలి. ఫేస్‌బుక్‌ చేతుల్లోకి వెళ్లిపోగానే ఉచిత సర్వీసులకు తెరపడుతుందని అనేక వదంతులొచ్చాయి. దాదాపు రూ.1.2 లక్షల కోట్లు పెట్టి కొనుక్కున్న ఈ ప్లాట్‌ఫాం నుంచి అంతకంత రాబట్టు కునేందుకు ఫేస్‌బుక్‌ రూపకర్త జుకర్‌బర్గ్‌ ప్రయత్నిస్తా రని అంతా అనుకున్నారు. అయితే ఈ వార్తలను ఫేస్‌బుక్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. అయితే తాజాగా భారత్‌ పర్యటనలో ఉన్న వాట్సాప్‌ వైస్‌చైర్మన్‌ క్రిస్‌ డేనియల్స్‌ ఈ అనుమానాలకు తెరదించారు. భవిష్యత్తులో వాట్సాప్‌ స్టేటస్‌ను యాడ్‌లకు వాడుకుంటామని ప్రకటించారు. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నది మాత్రం స్పష్టత లేదు.

‘అధిక లాభాల కోసం వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను అమ్మేసుకున్నా. ఈ విషయంలో రాజీపడ్డాను. ప్రతిరోజూ ఈ విషయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. టార్గెటెడ్‌ యాడ్స్‌ ద్వారా డబ్బు సంపాదించాలని ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ ఎప్పుడో ప్రణాళిక సిద్ధం చేశాడు’.
– బ్రాయన్‌ యాక్టన్, వాట్సాప్‌ రూపకర్త

స్టేటస్‌లోనే ఎందుకు?
యాడ్‌ల కోసం వాడుకునేందుకు వాట్సాప్‌.. స్టేటస్‌నే ఎందుకు ఎన్నుకుంది.. చాటింగ్‌ విండోతో పాటు అనేక అవకాశాలు ఉన్నాయి కదా.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే స్టేటస్‌ ఫీచర్‌ గురించి ముందు తెలుసుకోవాలి. స్టేటస్‌ అప్‌డేట్‌ అనేది 24 గంటలు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. ఈ విషయం దాదాపు చాలా మందికే తెలుసు. ఉదయాన్నే ‘ఫీలింగ్‌ హ్యాపీ’అని స్టేటస్‌ పెట్టారనుకోండి. అలాగే సెల్ఫీ తీసుకుని పోస్ట్‌ చేశారనుకోండి.. సరిగ్గా 24 గంటల తర్వాత ఆ స్టేటస్‌ ఉండదు. మీ స్టేటస్‌తో పాటు వచ్చే యాడ్‌లు కూడా 24 గంటలే ఉంటాయన్న మాట. ఇంకోలా చెప్పాలంటే.. మీ అభిరుచులు, మీరున్న ప్రాంతం వంటి అనేక వివరాలను పరిగణనలోకి తీసుకుని మీకు తగిన ప్రకటనలను స్టేటస్‌ ఫీచర్‌లోకి కంపెనీ జొప్పిస్తుందన్నమాట! వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్టు ప్రకటనలను వాల్‌పై 
పోస్ట్‌ చేసేందుకు ఫేస్‌బుక్‌లో ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌.. వాట్సాప్‌కు ఎలాగూ ఉపయోగ పడుతుందని అంచనా. 

ఇవీ ప్రత్యామ్నాయాలు
డిస్‌కార్డ్‌.. 
ఈ క్రాస్‌ ప్లాట్‌ఫాం ముఖ్యంగా గేమర్స్‌ కోసం ఉద్దేశించింది. అన్నిరకాల స్మార్ట్‌ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో పాటు వెబ్‌క్లయింట్‌ కూడా ఉంది. తమదైన సర్వర్లను తయారు చేసుకోగలగడం దీని కున్న ఇంకో ప్రత్యేకత. వాయిస్, చాటింగ్‌ ఫీచర్లు ఓ మోస్తరుగానే ఉన్నా ఆర్గనైజేషన్‌ సిస్టమ్స్‌ బాగుంటుందని ఈ ప్లాట్‌ఫాంను వాడేవారు చెబుతుంటారు.

అల్లో /హ్యాంగౌట్స్‌.. 
హ్యాంగౌట్స్‌ గురించి ఇప్పటికే చాలామందికి తెలుసుగానీ.. గూగుల్‌ సృష్టించిన తాజా మెసెం జర్‌ ప్లాట్‌ఫాం అల్లో వివరాలు మాత్రం పెద్దగా తెలియవు. గూగుల్‌ అసిస్టెంట్‌తో అనుసంధా నమైన ప్లాట్‌ఫాం ఇది. గూగుల్‌ డుయో సపోర్ట్‌ కూడా ఉంటుంది. ఇతరులు గుర్తించకుండా చాటింగ్‌ చేసేందుకు ఇందులో ఇన్‌కాగ్నిటో మోడ్‌ కూడా ఉంటుంది.

కిక్‌.. 
మన పేరు, ఫోన్‌ నంబర్ల స్థానం లో ఇతర పేర్లను యూజర్‌ ఐడీ లుగా వాడుకునేందుకు అవకాశం కల్పించే మెసెంజర్‌ ప్లాట్‌ఫాం ఇది. మొబైల్‌ గేమర్స్, పరిచయంలేని వారితోనూ మాటలు కలపాలను కునే వారికి మెరుగైన ప్లాట్‌ఫాం.

  • ఇవేకాక స్నాప్‌చాట్, టెలీగ్రామ్, వైబర్, స్కైప్‌ వంటివెన్నో.
మరిన్ని వార్తలు