ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది!

21 May, 2014 00:38 IST|Sakshi
ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది!
  • వివిధ శాఖల అధికారులతో సెయిల్ నిపుణుల సమాలోచనలు
  • నేటి నుంచి ఖమ్మం, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటన
  •  సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) లిమిటెడ్ బృందం అధ్యయనం ప్రారంభించింది. ఇందులో భాగంగా సెయిల్ అధికారి అశోక్ కుమార్ ఝా నేతృత్వంలోని సాంకేతిక బృందం పరిశ్రమలశాఖ కమిషనర్ రజత్‌కుమార్‌తో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ అధికారులతో పాటు మైనింగ్, విద్యుత్, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం, వైఎస్సార్ జిల్లాల్లో ఏయే ప్రాంతాల్లో బొగ్గు నిల్వలు ఉన్నాయి? ఎంత మేర ఉన్నాయి? అక్కడ ఉన్న భూమి వివరాలతోపాటు విద్యుత్ డిమాండ్, సరఫరా అంశాలను ఈ సందర్భంగా అధికారులతో సెయిల్ బృందం చర్చించింది.
     
    తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఆరు నెలల్లోగా సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని సెయిల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం-2014లో కేంద్రం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా సెయిల్ బృందం రాష్ట్రంలో పర్యటిస్తోందని పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు.
     
     నేడు, రేపు ఖమ్మంలో పర్యటన
     సెయిల్ సాంకేతిక బృందం ఖమ్మం, వైఎస్సార్ జిల్లాల్లో వరుసగా పర్యటించనుంది. ముందుగా ఈ నెల 21, 22 తేదీల్లో ఖమ్మం జిల్లాలో పర్యటించనుంది. అనంతరం 23, 24 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనుందని తెలిసింది. సుమారు 15 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఉక్కు కర్మాగారం నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను ఈ బృందం అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

మరిన్ని వార్తలు