మరో వివాదంలో ఇన్ఫోసిస్‌

21 Oct, 2019 16:46 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. కంపెనీ రాబడి, లాభాలని అధికంగా చూపేందుకు ఉన్నతాధికారులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపణలు  దుమారం రేపుతున్నాయి. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్,  సీఎఫ్‌వో నిలంజన్ రాయ్పై కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా క్వార్టర్స్ నుంచి తక్కువసమయంలో ఆదాయం, లాభాల కోసం కంపెనీ అనైతిక విధానాలను ఆచరిస్తుందని ఆరోపించారు. 'ఎథికల్ ఎంప్లాయిస్' పేరుతో ఏర్పడిన సంస‍్థలోని ఉద్యోగుల బృదం ఈ మేరకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డుకు, అలాగే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసి) కి ఫిర్యాదు చేసింది. ఆడిటర్లను ఆయా డీల్స్కు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించాలని, మార్జిన్లు, అప్రకటిత ముందస్తు కమిట్మెంట్లు, రాబడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలనీ కోరింది. ఈ ఫిర్యాదును కంపెనీ విధానం ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచామనీ, విజిల్‌బ్లోయర్స్ పాలసీకి అనుగుణంగా దీనిపై విచారణ ఉంటుందని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ క్వార్టర్(త్రైమాసికం)లో ఎఫ్‌డిఆర్ కాంట్రాక్టులో 50 మిలియన్ డాలర్ల ముందస్తు చెల్లింపు రివర్సల్‌లను గుర్తించవద్దని చాలా ఒత్తిడి తెచ్చారని, ఇది అకౌంటింగ్ ప్రాక్టీస్‌కు విరుద్ధమని, ఇది త్రైమాసికంలో లాభాలను తగ్గిస్తుందని, స్టాక్ ధరకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇన్ఫోసిస్ సీఈవో,సీఎఫ్వో ఒత్తిడి చేస్తున్నారని సెప్టెంబర్-20,2019న బోర్డుకి రాసిన లేఖలో వారు ఆరోపించారు. తమ ఆరోపణలకు సంబంధించిన ఈమెయిల్స్, వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయని  ఫిర్యాదు దారులు వాదిస్తుండటం విశేషం. వెరిజోన్, ఇంటెల్,ఏబిన్ అమ్రో వంటి పెద్ద కాంట్రాక్టులలో ఆదాయ గుర్తింపు విషయాలు అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం లేవని, దీనికి సంబంధించిన  ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, విచారణ అధికారులు తమను అడిగినప్పుడు వీటిని సమర్పిస్తామని విజిల్ బ్లోయర్స్ తెలిపారు. ఆడిటర్స్ కి పెద్ద డీల్ సమాచారం  తెలియజేయవద్దని తమను అడిగినట్లు కూడా వారు ఆ లేఖలో తెలిపారు.

కాగా  2017లో ఇన్ఫోసిస్‌ ఫౌండర్లు,  అప్పటి బోర్డు మధ్య విభేదాలతో సంక్షోభం ఏర్పడింది. మాజీ సీఎఫ్‌వో రాజీవ్‌ బన్సల్‌కు చెల్లించిన ప్యాకేజీ వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే అప్పటి సీఈవో విశాల్‌ సిక్కా పదవినుంచి వైదొలిగారు.  ఆ తరువాత  ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని  చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది జనవరిలో సలీల్‌ పరేఖ్‌ సీఈవోగా ఎంపికయ్యారు. 

ఇంతకుముందు, ఇజ్రాయెల్ ఆటోమేషన్ టెక్నాలజీ సంస్థ పనయాను కొనుగోలుపై  ఆరోపణలతో కూడిన నివేదికను ఇన్ఫోసిస్ తన అంతర్గత ఆడిట్ కమిటీ, దర్యాప్తు తరువాత, ఆరోపణలకు ఆధారాలు లేవని తోసి పుచ్చింది. అంతేకాదు ఈ ఏడాది ఆరంభంలో బన్సాల్‌కు చెల్లించిన చెల్లింపులకు సంబంధించి బహిర్గతం చేసిన లోపాల కేసును ఇన్ఫోసిస్ సెబీతో పరిష్కరించుకుంది. ఇందుకు మార్కెట్ రెగ్యులేటర్‌కు రూ .34.34 లక్షలు చెల్లించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు