‘వాట్సాప్‌’లో ‘గూఢాచోరులు’ ఎవరు?

1 Nov, 2019 14:02 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలోని 17 మంది మానవ హక్కుల కార్యకర్తలు, దళిత కార్యకర్తలు, జర్నలిస్టుల ‘వాట్సాప్‌’ ఖాతాలపై ఇజ్రాయెల్‌లోని ‘ఎన్‌ఎస్‌ఓ’ టెక్నాలజీ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ‘పెగాసస్‌’ సాఫ్ట్‌వేర్‌తో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిఘా కొనసాగిస్తున్నారనే విషయం గురువారం వెలుగులోకి రావడం అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒక్క వాట్సాప్‌ సందేశాలను మాత్రమే తస్కరించడం లేదు. వాట్సాప్‌ ఫోన్‌ కాల్స్‌ను వింటున్నారు. రికార్డు చేస్తున్నారు. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌కున్న శక్తి సామర్థ్యాల ప్రకారం ఫోన్‌లోని పాస్‌వర్డ్‌లను, ఫొటోలను, వీడియోలను కూడా తస్కరించవచ్చు.

కేవలం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, డిజిటల్‌ చెల్లింపుల యుగంలో పౌరులను ఆర్థికంగా కొల్లగొట్టేందుకు, ఇతర విపరీత పరిణామాలకు దారితీయగల ఈ ‘గూఢచర్య’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న ముసుగు దొంగలు ఎవరు? డేటా భద్రత వైఫల్యంపై ఆందోళన చెందుతున్నామని, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కేంద్రానికి అందజేయాల్సిందిగా కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ‘వాట్సాప్‌’ యాజమాన్యాన్ని కోరారు. ఆయన మాటలకు అర్థం కేంద్ర ప్రభుత్వానికిగానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకుగానీ సంబంధం లేదని చెప్పడం. మరి పౌరులపై నిఘా కొనసాగించాల్సిన అవసరం ఎవరికుంది?

ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ నగరానికి సమీపంలో 2010లో ఏర్పాటయిన ఈ ఎన్‌ఎస్‌ఓ సంస్థ పెగాసస్‌ అనే ‘స్పైవేర్‌’ను తానే విక్రయించినట్లు ఒప్పుకుంది. అయితే ఎవరికన్నది స్పష్టంగా చెప్పకపోయినా తాను ప్రభుత్వ సంస్థలకు తప్ప మరెవరికీ ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను  విక్రయించడం లేదని చెప్పింది. ఆ సంస్థ 2016 నిర్ణయించిన ధరల పట్టిక ప్రకారం పది మంది యూజర్ల డేటాపై నిఘా కోసం పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ధరను ఒక మిలియన్‌ డాలర్లు. ఆ నిఘాను మరో పది మందికి పెంచాలంటే మరో రేటును చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వైరస్‌లాగా ఇది నెట్‌వర్క్‌ అంతటికి వ్యాపించకుండా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. మిస్సిడ్‌ కాల్‌ ద్వారా వాట్సాప్‌లోకి స్పైవేర్ ప్రవేశిస్తుంది. పది మందిపై నిఘాకే దాదాపు ఏడు కోట్ల రూపాయలను వెచ్చించి ప్రైవేటు వ్యక్తులు ఎవరు కొనుగోలు చేస్తారు? ఎన్‌ఎస్‌ఓ ప్రకారం ప్రభుత్వ సంస్థ అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సీబీఐ, లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని నేర పరిశోధనా సంస్థనో అయ్యి ఉండాలి. నిఘా నీడలో మానవ హక్కుల కార్యకర్త బేలా బాటియా, బీబీసీ మాజీ జర్నలిస్ట్‌ సుభ్రాన్షు చౌధరి తదితరులు సామాజిక నేపథ్యం చూస్తే ఎవరు నిఘా వహించారో, ఆ గూఢాచోరులు ఎవరు ఇట్టే తెలిసిపోతుంది. (చదవండి: వాట్సాప్‌ డేటాపై ‘పెగాసస్‌’ గురి)

 

మరిన్ని వార్తలు