ట్రంప్‌ ‘సుంకం’ షాక్‌..!

10 Mar, 2018 01:18 IST|Sakshi

ఉక్కు దిగుమతులపై 25%, అల్యూమినియంపై 10% విధింపు; 15 రోజుల్లో అమల్లోకి

మెక్సికో, కెనడాకు మినహాయింపు

మిగతా దేశాలకూ చర్చల ద్వారా అవకాశం

ఇది దేశ భద్రత కోసమే: ట్రంప్‌

భారత్, చైనాల మాదిరే తామూ స్పందిస్తామని వ్యాఖ్య

తాజా చర్యలపై మండిపడ్డ చైనా, యూరోపియన్‌ దేశాలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌... మొత్తానికి అన్నంత పనీ చేశారు. అమెరికాలోని ఉద్యోగాలను, ఎకానమీని కాపాడే పేరిట వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచ దేశాలను నిత్యం టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌ తాజాగా ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలు విధించారు. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు శుక్రవారం ఆమోదముద్ర వేశారు. తద్వారా అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాల భయాలకు ఆజ్యం పోశారు.

ట్రంప్‌ ప్రస్తుత నిర్ణయంతో... ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం మేర దిగుమతి సుంకాలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయి. అయితే, పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. మిగతా దేశాలు కూడా మినహాయింపులు కావాలనుకుంటే అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధులతో (యూఎస్‌టీఆర్‌) చర్చల ద్వారా సాధించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ట్రంప్‌ నిర్ణయంపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తం కాగా.. కీలక వ్యాపార భాగస్వామ్య దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలు రెండూ.. దేశ భద్రతకు సైతం కీలకమైనవని ఈ సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘ఉక్కు ఉక్కే. దీనికి తిరుగులేదు. ఉక్కు లేకుంటే దేశం లేదు. అనేక సంవత్సరాలుగా మన పరిశ్రమలను మిగతా దేశాలు టార్గెట్‌ చేశాయి. నిజానికి దశాబ్దాలుగా పాటిస్తూ వస్తున్న అనుచిత విదేశీ వాణిజ్య విధానాల వల్ల మన ప్లాంట్లు మూతపడ్డాయి. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని వర్గాలు పూర్తిగా అణగారిపోయాయి. ఇకపై ఇలాంటివన్నీ ఆగిపోతాయి‘ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ఉక్కు, అల్యూమినియంపై సుంకాల విధించడం ద్వారా అమెరికా భద్రతను కూడా కాపాడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికాలో ఉక్కు, అల్యూమినియం రంగంలో పెరుగుతున్న సంక్షోభం గురించి వాణిజ్య శాఖ తొమ్మిది నెలలుగా అధ్యయనం చేసిన మీదట ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.

అమెరికా ప్రయోజనాల కోసమే..
అమెరికా ఉద్యోగులు, కంపెనీల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ చెప్పారు. అమెరికాలో తయారు చేసే ఉత్పత్తులపై పన్నులు ఉండవని.. ఒకవేళ ఇతర దేశాల కంపెనీలేవైనా ఆ ప్రయోజనాలు పొందదల్చుకుంటే, అమెరికాలోనే ప్లాంటు పెట్టి పొందవచ్చని తెలియజేశారు.

‘మన నౌకలు, మన విమానాలు.. మన యుద్ధ పరికరాలు మొదలైన వాటన్నింటినీ మన దేశంలో తయారైన ఉక్కు, అల్యూమినియంతోనే ఉత్పత్తి చేద్దాం. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుంటున్నాం‘ అని ట్రంప్‌ పేర్కొనారు.

కాగా అమెరికాలోనే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొని వర్గాలు అమెరికాకు ప్రయోజనకరమైన చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించగా... మరికొన్ని వర్గాలు ఈ నిర్ణయం దేశ ఎకానమీని దెబ్బతీస్తుందని, వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

భారత్‌ ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రతికూలం..
సుంకాల వల్ల భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఇంజనీరింగ్‌ ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఇంజనీరింగ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఈఈపీసీ) చైర్మన్‌ రవి సెహ్‌గల్‌ తెలిపారు. అమెరికా బాటలోనే చైనా, యూరప్‌ కూడా రక్షణాత్మక చర్యలకు దిగితే భారత ఎగుమతులు మరింతగా దెబ్బతింటాయన్నారు. అమెరికా దిగుమతి చేసుకునే మొత్తం ఉక్కులో భారత్‌ వాటా 1.28 శాతంగా, అల్యూమినియం దిగుమతుల్లో 1.12 శాతంగా ఉంది.

చైనా, ఈయూ అభ్యంతరాలు..
దిగుమతి సుంకాల విధింపుపై చైనాతో పాటు యూరోపియన్‌ యూనియన్‌లోని అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించాయి. సుంకాల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా పేర్కొనగా.. ఇరు దేశాల సంబంధాలపై ఇది పెను ప్రభావం చూపుతుందని జపాన్‌ వ్యాఖ్యానించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో (డబ్ల్యూటీవో) ఫిర్యాదు చేసే అవకాశం ఉందని దక్షిణ కొరియా వెల్లడించింది.

మిగతా యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో కలిసి పరిణామాల ప్రభావాలపై చర్చించి, తగు నిర్ణయాలు తీసుకుంటామని ఫ్రాన్స్‌ పేర్కొంది. వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు టారిఫ్‌లు విధించడమనేది సరైన పద్ధతి కాదని బ్రిటన్‌ అభిప్రాయపడింది. రక్షణాత్మక ధోరణులు, టారిఫ్‌లు పనిచేయవని పేర్కొంది.

సుంకాల పెంపునకు ప్రతీకారంగా చర్యలు తీసుకునేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, అయితే చర్చలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తామని యూరోపియన్‌ కమిషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జిర్కీ కెటైనెన్‌ తెలిపారు. అమెరికా నుంచి దిగుమతయ్యే ఏయే ఉత్పత్తులపై సుంకాలు విధించవచ్చన్న దానిపై బ్రసెల్స్‌ ఇప్పటికే ఒక జాబితా కూడా సిద్ధం చేసింది.  


భారత్‌కు హెచ్చరిక..
సుంకాల విధింపు విషయంలో పనిలో పనిగా చైనాతో పాటు భారత్‌కు కూడా హెచ్చరికల్లాంటివి చేశారు ట్రంప్‌. చైనా, భారత్‌ లాంటి దేశాలు విధించే సుంకాలకు, అమెరికా విధించే సుంకాలకూ వ్యత్యాసముంటే ఆ మేరకు మార్పులుంటాయన్నారు.

‘ఏదో ఒక దశలో ఈ తరహా విధానాన్ని కూడా తెస్తాం. ఉదాహరణకు మనమేమీ సుంకాలు విధించకుండానే.. చైనా 25 శాతమో.. భారత్‌ 75 శాతమో విధిస్తోందనుకుందాం. అలాంటప్పుడు మనమూ అదే స్థాయిలో సుంకాలు విధిస్తాం. వాళ్లు 50 శాతం వేస్తే.. మనమూ 50 శాతం విధిస్తాం‘ అని అధికారిక ప్రకటనలపై సంతకాలు చేయడానికి ముందు ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

అమెరికా మోటార్‌ సైకిల్స్‌ ముఖ్యంగా – హార్లే డేవిడ్‌సన్‌ బైకుల మీద భారత్‌ విధిస్తున్న సుంకాలు చాలా భారీగా ఉంటున్నాయని ట్రంప్‌ కొద్ది రోజుల క్రితమే ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మార్చి 20న భారత్‌ నిర్వహించబోయే డబ్ల్యూటీవో సదస్సుకు అమెరికా ప్రతినిధి రాబర్ట్‌ లైథిజర్‌ రాకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు