4 ఏళ్లలో ఎన్నడూ లేనంత ధరల భయం

17 Jul, 2018 00:46 IST|Sakshi

జూన్‌లో 5.77 శాతం పెరిగిన టోకు ధరలు

కూరగాయలు, ఇంధన ధరల భారం

రెపో రేటు మరింత పెరిగే అవకాశం  

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ధరల పెరుగుదల రేటు 5.77 శాతం. అంటే 2017 జూన్‌ నెలతో పోల్చిచూస్తే, 2018 జూన్‌ నెలలో టోకు వస్తువుల బాస్కెట్‌ ధరలు 5.77 శాతం పెరిగాయన్నమాట. కూరగాయలు, ఇంధన ధరల పెరుగుదల వంటివి దీనికి కారణం.

ధరల పెరుగుదల రేటు ఇదే విధంగా తీవ్రంగా ఉంటే, ఆగస్టు పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు (ప్రస్తుతం 6.25 శాతం)ను మరో పావుశాతం పెంచే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. జూన్‌ పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ రెపో పావుశాతం పెరిగిన సంగతి తెలిసిందే.  2017 జూన్‌ నెలలో టోకు ద్రవ్యోల్బణం కేవలం 0.90 శాతంగా ఉంది. 2018 మేలో ఇది 4.43 శాతం. 2013 డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.9 శాతం ఉంది. అటు తర్వాత 2018 జూన్‌ నెలలోనే మళ్లీ అప్పటి తీవ్ర స్థాయికి చేరింది.  

ప్రధాన విభాగాలన్నీ పెరుగుదలే..!
 ప్రైమరీ ఆర్టికల్స్‌: ఫుడ్‌ ఆర్టికల్స్, నాన్‌–ఫుడ్‌ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్‌ ద్రవ్యోల్బణం భారీగా 5.30 శాతం ఎగసింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు ద్రవ్యోల్బణం పెరక్కపోగా –  4.17 శాతం క్షీణించింది. ఇక ఒక్క ఫుడ్‌ ఆర్టికల్స్‌లో రేటు –3.33 శాతం క్షీణత నుంచి 1.80 శాతానికి పెరిగింది. నాన్‌– ఫుడ్‌ ఆర్టికల్స్‌ రేటు కూడా –4.99 శాతం క్షీణత నుంచి 3.81 శాతానికి పెరిగింది. మే నెలలో ఈ రేటు కేవలం 1.6 శాతంగా ఉంది.  
ఇంధనం, విద్యుత్‌: ఈ రంగంలో ద్రవ్యోల్బణం 5.16 శాతం నుంచి 16.18 శాతానికి ఎగసింది. మేలో ఇది 11 శాతం మాత్రమే.  
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 2.36 శాతం నుంచి 4.17 శాతానికి పెరిగింది.  

కూరగాయల ధరల చూస్తే...
మేలో పెరుగుదల రేటు కేవలం 2.51 శాతం ఉంటే ఇది జూన్‌లో ఏకంగా 8.12 శాతానికి ఎగసింది. ఆలూ ధరలు మేలో 81.93 శాతం పెరుగుదల ఉంటే, జూన్‌లో మరింతగా 99.02 శాతానికి పెరిగాయి. ఉల్లి ధరలు ఇదే కాలంలో 13.20 శాతం నుంచి 18.25 శాతానికి ఎగశాయి. అయితే పప్పు దినుసుల ధరలు మాత్రం పెరక్కపోగా 20.23 శాతం తగ్గాయి.  ఇటీవలే ప్రకటించిన రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా 4 శాతం పైగా నమోదయ్యింది.

మరిన్ని వార్తలు