క్షీణతలోనే... టోకు ద్రవ్యోల్బణం

17 Nov, 2015 02:52 IST|Sakshi
క్షీణతలోనే... టోకు ద్రవ్యోల్బణం

అక్టోబర్‌లో మైనస్ 3.81 శాతం
* 12 నెలల నుంచీ ఇదే ధోరణి
* అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల ఎఫెక్ట్
* నిత్యావసరాల్లో... పప్పులు, ఉల్లి ధరలు భారం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెలలోనూ అసలు పెరక్కపోగా... మైనస్‌లోనే  కొనసాగింది.

అక్టోబర్‌లో -3.81%గా నమోదయ్యింది.  సెప్టెంబర్‌లో ఈ రేటు -4.54%. 2014 ఇదే నెలలో ఈ రేటు 1.66%గా ఉంది.  దేశంలో టోకు ధరల సూచీ అసలు పెరక్కపోడానికి  కారణాల్లో  అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం ఒకటి. అయితే టోకున చూస్తే... నిత్యావసరాల్లో పప్పులు, ఉల్లి ధరలు తీవ్రంగా ఉన్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... మూడు ప్రధాన విభాగాల వార్షిక రీతిన వివరాలు...
 
మూడు విభాగాలూ మైనస్‌లోనే...
ప్రైమరీ ఆర్టికల్స్:
ఫుడ్, నాన్-ఫుడ్, మినరల్స్ విభాగాలతో కూడిన ఈ కేటగిరీలో ద్రవ్యోల్బణం -0.36% క్షీణతలో ఉంది. అయితే ప్రధానంగా ఫుడ్ ఆర్టికల్స్‌ను ఇందులో చూస్తే పెరుగుదల రేటు 2.44%.
 
ఫ్యూయల్ అండ్ పవర్:
ద్రవ్యోల్బణం క్షీణతలో -16.32%గా ఉంది.
 
తయారీ: సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న ఈ రంగంలో కూడా ద్రవ్యోల్బణం -1.67 శాతంగా ఉంది.
 ఆహార ఉత్పత్తులు...: ఫుడ్ కేటగిరీలో టోకు ద్రవ్యోల్బణం మొత్తంగా 2.44% పెరిగితే... ప్రధానంగా పప్పులు, ఉల్లి ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. పప్పు దినుసుల ధరలు వార్షికంగా 52.98% పెరిగాయి.

ఉల్లి ధరలు 85.66% అధికంగా ఉన్నాయి. కూరగాయల ధరలు 2.56% పెరిగాయి. ఈ నెలలో ధరలు పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో పాలు (1.75%), గోధుమలు (4.68%) ఉన్నాయి. ధరలు తగ్గిన ఉత్పత్తుల్లో ఆలుగడ్డ (-59%) ఉంది.
 
పాలసీ సమీక్షపై దృష్టి...
డిసెంబర్ 1న ఆర్‌బీఐ పాలసీ సమీక్షను నిర్వహించనుంది. ఈ సందర్భంగా నిర్ణయానికి అక్టోబర్ టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. అక్టోబర్‌లో వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఈ రేటు నాలుగు నెలలుగా పెరుగుతూ వస్తోంది. పప్పులు, ఇతర ఆహార ఉత్పత్తుల రిటైల్ ధరల పెరుగుదలే దీనికి కారణం.

మరిన్ని వార్తలు