టోకు ధర తగ్గినా... పెట్రో భయాలు!

17 Apr, 2018 01:00 IST|Sakshi

మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 2.47 శాతం

అయినా, అంతర్జాతీయ చమురు ధరలపై ఆందోళన

బలహీనపడుతున్న రూపాయీ సమస్యే!  

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చిలో ఊరట కలిగించింది. ధరల పెరుగుదల రేటు కేవలం 2.47 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 మార్చి ధరలతో పోల్చిచూస్తే, 2018 మార్చిలో టోకు బాస్కెట్‌ ధరల పెరుగుదల రేటు కేవలం 2.47 శాతంగా ఉందన్నమాట. ఈ రేటు 2018 ఫిబ్రవరిలో 2.48 శాతం.2017 మార్చిలో 5.11 శాతం. అటు తర్వాతి 12 నెలల్లో అంత స్థాయికి దిగువనే టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం గమనార్హం.

అయితే ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం తీరు ఊరటనిస్తున్నా, అంతర్జాతీయంగా చమురు ధరల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రభావం దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు తదనంతరం నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీయవచ్చన్నది పలువురి ఆందోళన. డాలర్‌ మారకంలో బలహీనపడుతున్న రూపాయి  (దేశీయంగా ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే్ఛంజ్‌లో సోమవారం 6 నెలల గరిష్ట స్థాయిలో 65.49 వద్ద ముగింపు) ధరల పరుగుకు కారణం కావచ్చు. మార్చిలో టోకు సూచీలో మూడు ప్రధాన భాగాలను వార్షిక రీతిన పరిశీలించి చూస్తే..

ప్రైమరీ ఆర్టికల్స్‌: ఫుడ్, నాన్‌–ఫుడ్‌ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 3.33 శాతం నుంచి 0.24 శాతానికి తగ్గింది. ఇందులో ఒక్క ఫుడ్‌ ఆర్టికల్స్‌ రేటు 3.15 శాతం నుంచి 0.24 శాతానికి చేరింది. నాన్‌–ఫుడ్‌ ఆర్టికల్స్‌ విభాగంలో రేటు అసలు పెరక్కపోగా –1.39 శాతంలోకి జారింది.
ఇంధనం, విద్యుత్‌: ఈ రేటు ఏకంగా 22.35 శాతం నుంచి 4.70 శాతానికి జారింది. అయితే నెలవారీగా చూస్తే, మాత్రం ఫిబ్రవరి (3.81 శాతం) కన్నా ఈ విభాగంలో రేటు పెరగడం గమనార్హం.
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 58శాతం వాటా ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 2.33 శాతం నుంచి 0.03 శాతానికి తగ్గింది.
నిత్యావసరాలు ఇలా: పప్పు ధాన్యాల ధరలు అసలు పెరక్కపోగా 20.58 శాతం తగ్గాయి. (2017 మార్చి ధరతో పోల్చి 2018 మార్చి ధర). కూరగాయలు (–2.70%), గోధుమలు (–1.19%) గుడ్లు, మాంసం, చేపలు (–0.82%) ధరలు తగ్గాయి. అయితే ఉల్లి, ఆలూ ధరలు 42.22%, 43.25% చొప్పున ఎగిశాయి. కాగా చక్కెర ధరలు 10.48% పెరిగాయి.  ఆహార ధరల తగ్గుదల వల్ల మార్చి రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.28 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.

సగటు 3.9 శాతం ఉండొచ్చు...
2018–19లో టోకు ద్రవ్యోల్బణం సగటున 3.9 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2017–18లో ఇది 2.9 శాతం. పెట్రో ధరల పెరుగుదల అవకాశాలు ఆందోళన కలిగించే అంశం. జనవరికి సంబంధించి 2.84 శాతం ద్రవ్యోల్బణం అంచనాలను తాజాగా 3.02 శాతానికి పెంచడం ఇక్కడ గమనార్హం. -  అదితి నయ్యర్, ఇక్రా ప్రిన్సిపల్‌ ఎకనమిస్ట్‌

మరిన్ని వార్తలు