పుత్తడి పెరిగే ముందు.. కాస్త క్షీణత

18 Jul, 2016 00:54 IST|Sakshi
పుత్తడి పెరిగే ముందు.. కాస్త క్షీణత

ముంబై/లండన్: పుత్తడి ధరలు మరింత పెరిగే ముందు...ప్రస్తుతస్థాయికన్నా మరికాస్త తగ్గవచ్చని బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా జాబ్స్ డేటా, రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటాలు మెరుగ్గా వుండటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బాగా వృద్ధిచెందుతున్నట్లు అంచనాలు ఏర్పడి పుత్తడి తాత్కాలికంగా తగ్గిందని వారన్నారు. గతవారం ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర 2.9 శాతం మేర క్షీణించి 1,358 డాలర్ల నుంచి 1,327 డాలర్ల స్థాయికి దిగింది. ఈ తగ్గుదల తాత్కాలికమేనని, బ్రెగ్జిట్ కారణంగా అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను ఇప్పట్లో పెంచే అవకాశాలు లేకపోవడంతో బంగారం రానున్న వారాల్లో మళ్లీ పెరుగుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

 దేశీయంగా...
అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర గతవారం అంతక్రితం వారంతో పోలి స్తే రూ. 270 మేర క్షీణించి రూ. 31,085 స్థాయికి తగ్గింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి ధర సైతం అంతే తగ్గుదలతో రూ. 30,935 వద్ద ముగిసింది. దేశీయంగా దాదాపు రికార్డు గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతున్నందున, జువెల్లర్స్, స్టాకిస్టులు, ట్రేడర్ల నుంచి డిమాండ్ తగ్గిందని బులియన్ వర్తకులు చెప్పారు.

మరిన్ని వార్తలు