ఆర్‌బీఐ ‘ఛీర్‌లీడర్’ కాదు..

3 Jun, 2015 02:09 IST|Sakshi
ఆర్‌బీఐ ‘ఛీర్‌లీడర్’ కాదు..

క్షేత్రస్థాయిలో వృద్ధి కనబడటంలేదు...
వినియోగ డిమాండ్ పుంజుకుంటున్న దాఖలాల్లేవు...
పాలసీ రేటు తగ్గింపు కొంత పొరపాటేనేమో...!
సమీక్ష అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు

ముంబై: ‘మార్కెట్లను ఉత్సాహపరచడానికి ఆర్‌బీఐ ఛీర్‌లీడర్ కాదు.. పెట్టుబడులకు ఊతమిచ్చేందుకే పాలసీ రేటు(రెపో)ను తగ్గించాం. అయితే, క్షేత్రస్థాయిలో వృద్ధి ఫలాలు కనబడటంలేదు. అసలు రేట్ల తగ్గింపు విషయంలో మేం కొంత పొరపాటు చేశామనిపిస్తోంది’ అని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు.

ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజన్ స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించారు. అంతేకాదు వృద్ధి రేటు 7.5 శాతం స్థాయిలో నమోదవుతున్నప్పుడు అసలు రేట్ల తగ్గింపు కోసం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదంటూ గణాంకాల్లోని వాస్తవికతపై వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. ‘తాజా జీడీపీ వృద్ధి గణాంకాల్లో చాలా వైరుధ్యాలు కనబడుతున్నాయి.

ఒకపక్క, వినియోగ డిమాండ్ పుంజుకుంటున్న దాఖలాలేవీ లేవు. కార్పొరేట్ల లాభాలు కూడా దిగజారుతున్నాయి. ఇలాంటి తరుణంలో అధిక వృద్ధి రేటు గణాంకాలు ఎలా సాధ్యమయ్యాయన్న ప్రశ్న తలెత్తుతోంది’ అని రాజన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రేట్ల కోత నిర్ణయం అనేది ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, రుతుపవనాల గమనంపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రజల్లో విశ్వాసం నింపడమే మా పని...
రూపాయి విలువను స్థిరంగా ఉంచడం, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నింపడమే తమ ప్రధాన బాధ్యతని రాజన్ స్పష్టం చేశారు.  అంతేకానీ, ఎవరినో మెప్పించడం కోసం ఛీర్‌లీడర్‌గా వ్యవహరించాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. అరశాతం కాకుండా కేవలం పావు శాతం రెపో కోతకే ఎందుకు పరిమితమయ్యారన్న విలేకరుల ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

‘తాజా పాలసీ నిర్ణయం పూర్తిగా స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే తీసుకున్నాం.  భవిష్యత్తులోనూ మా పాలసీ చర్యలన్నీ గణంకాల ఆధారంగానే ఉంటాయి’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఒత్తిడితోనే రేట్లను తగ్గించారన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. ‘రేట్లను తగ్గిస్తేనేమో ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవానికేనని అంటారు. తగ్గించకపోతే సర్కారుతో కొట్లాడుతున్నానని చెబుతారు’ అంటూ రాజన్ కాస్త సరదా వ్యాఖ్యలు చేశారు. వడ్డీరేట్లను తగ్గించకుండా కఠినంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలను కూడా ఆయన తోసిపుచ్చారు. ‘ఆర్థిక వ్యవస్థ అవసరాలు, పరిస్థితులను బట్టే మేం స్పందిస్తాం.. అంతేకానీ, దానికి సమాధి కట్టడానికి కాదు.  అనాలోచిత నిర్ణయాలను ఆర్‌బీఐ తీసుకోదు’ అని స్పష్టం చేశారు.

బ్యాంకులపైనా విసుర్లు...
తమ పాలసీ నిర్ణయాలకు అణుగుణంగా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లను మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని రాజన్ మరోసారి హెచ్చరికలు పంపారు. ‘ఇటీవలి కాలంలో డిపాజిట్ రేటును ఒక శాతం మేర తగ్గించిన బ్యాంకులు రుణాలపై మాత్రం ఆ స్థాయిలో వడ్డీని తగ్గించలేదు. స్వల్పకాలిక మార్జిన్ల కోసం వెంపర్లాడడం వల్ల బ్యాంకులు మార్కెట్ వాటాను కోల్పోవాల్సి వస్తోంది.

రుణ రేట్లు మార్కెట్‌కు అనుగుణంగా ఉండాలని ఆర్‌బీఐ ఆశిస్తోంది. బ్యాంకులు మాత్రం సగటు డిపాజిట్ వ్యయం ఆధారంగా రుణ రేట్లను నిర్ణయిస్తున్నాయి’ అని రాజన్ పేర్కొన్నారు. రెపో రేటు కంటే సీఆర్‌ఆర్ తగ్గింపు ద్వారానే రుణ రేట్లు దిగొచ్చేందుకు వీలవుతుందన్న బ్యాంకుల డిమాండ్‌ను కూడా ఆయన కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు