జెట్‌కు బ్యాంకుల బాసట

21 Mar, 2019 00:25 IST|Sakshi

సంస్థను నిలబెట్టేందుకు ప్రణాళికలు

మేనేజ్‌మెంట్‌ మార్పు యోచన

ఆర్థిక మంత్రి జైట్లీతో ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌ కుమార్‌ భేటీ

న్యూఢిల్లీ: భారీ రుణభారంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్‌ విమానయాన దిగ్గజం జెట్‌ ఎయిర్‌వేస్‌ కుప్పకూలకుండా చూసేందుకు బ్యాంకర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మేనేజ్‌మెంట్‌ మార్పు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్, పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా, ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయిన సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తో కంపెనీ నిర్వహణ సాధ్యపడే అవకాశాలు లేనందున.. జెట్‌ ఎయిర్‌వేస్‌ను పునరుద్ధరించేందుకు బ్యాంకులు రూపొందించిన ప్రణాళికలో యాజమాన్య మార్పు ప్రతిపాదన ఉండొచ్చని వివరించారు. 

దివాలా కోడ్‌ పరిష్కారం కాదు..
జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితుల గురించి ప్రభుత్వానికి వివరించేందుకే జైట్లీతో భేటీ అయినట్లు సమావేశం అనంతరం రజనీష్‌ కుమార్‌ చెప్పారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికపై బ్యాంకులు గత అయిదు నెలలుగా కసరత్తు చేస్తున్నాయని, ఇది దాదాపు సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. సర్వీసుల రంగంలో ఉన్న జెట్‌ లాంటి కంపెనీ నుంచి బకాయిలు రాబట్టుకునేందుకు దివాలా కోడ్‌ను తక్షణం ప్రయోగించడం పరిష్కారం కాదని, ఇది ఆఖరు అస్త్రం మాత్రమే కాగలదని కుమార్‌ చెప్పారు. ‘ఐబీసీని ప్రయోగించడమంటే కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడమే. అయితే, ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదనే మేం భావిస్తున్నాం. కాబట్టి జెట్‌ ఎయిర్‌వేస్‌ను నిలబెట్టేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. వీటిని.. ఒక వ్యక్తినో లేదా ప్రమోటరునో కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా భావించనక్కర్లేదు. బ్యాంకుల, దేశ, ఏవియేషన్‌ రంగ ప్రయోజనాలను కాపాడేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే పునరుద్ధరణ ప్రణాళిక గురించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. జెట్‌ లో కొత్తగా మరో వాటాదారును తెస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఆ అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. సంస్థలో 24% వాటాలు ఉన్న ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ వాటి విక్రయం కోసం ఎస్‌బీఐ ని సంప్రతించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్‌లో ప్రమోటరు నరేష్‌ గోయల్‌కు 51% వాటాలు ఉన్నాయి. 
దాదాపు రూ. 8,200 కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇప్పటికే రుణదాతలకు చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు నాటికి కంపెనీ రూ. 1,700 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. 119 విమానాలకు గాను.. ప్రస్తుతం కేవలం 41 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ మాత్రమే నడుపుతోంది. జీతాలు బకాయిపడటంతో అటు ఉద్యోగులూ ఆందోళనకు దిగబోతున్నారు. తక్షణం జీతాలు చెల్లించకపోతే ఏప్రిల్‌ 1 నుంచి విమానసేవలు నిలిపివేస్తామంటూ పైలట్ల యూనియన్‌ హెచ్చరించింది. కంపెనీ గానీ మూతబడితే దాదాపు 23,000 మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది.

స్లాట్స్‌ను వేరే సంస్థలకు కేటాయించడంపై దృష్టి..
జెట్‌ ఎయిర్‌వేస్‌ పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో నిరుపయోగంగా ఉంటున్న ఆ సంస్థ స్లాట్స్‌ను తాత్కాలికంగా ఇతర దేశీ ఎయిర్‌లైన్స్‌కు కేటాయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి వివిధ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులతో కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు బుధవారం సమావేశమయ్యారు. ఎయిరిండియా, స్పైస్‌జెట్, గోఎయిర్, ఇండిగో ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం ఎన్ని స్లాట్స్‌ ఉపయోగిస్తోంది, ఎన్ని అవసరం ఉందన్న దానిపై జెట్‌ ఎయిర్‌వేస్‌తో చర్చించనున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా తెలిపారు. రద్దీ సీజన్‌లో ఫ్లయిట్స్‌ రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూడాలన్నది తమ ఉద్దేశమని పేర్కొన్నారు.

ప్రధానికి పైలట్ల లేఖ..
జీతాల బకాయిల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్ల సంఘం నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌(ఎన్‌ఏజీ) తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాసింది. 7 నెలలుగా కంపెనీ జీతాలను సక్రమంగా చెల్లించడం లేదని.. దీంతో పైలట్లు, ఇంజనీర్లు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొంది. ‘జెట్‌ ఎయిర్‌వేస్‌ పతనం అంచున ఉందన్న భయాలు నెలకొన్నాయి. అదే జరిగితే వేల మంది సిబ్బంది ఉపాధి కోల్పోతారు. విమానాలు అందుబాటులో లేకపోవడం వల్ల చార్జీలు పెరిగిపోతాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది‘ అని వివరించింది. ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నందున.. భద్రతా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించింది. మార్చి నెలాఖరులోగా జీతాల బకాయిలు చెల్లించకపోతే ఏప్రిల్‌ 1 నుంచి విమాన సేవలు పూర్తిగా ఆపేస్తామంటూ పైలట్లు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

జెట్‌ విమానాలపై  స్పైస్‌జెట్‌ కన్ను..
మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌ కష్టాలు పోటీ సంస్థ స్పైస్‌జెట్‌కు వరంగా మారుతున్నాయి. పలు జెట్‌ ఫ్లయిట్స్‌ రద్దవుతుండటంతో.. ప్రయాణికులు స్పైస్‌జెట్‌ వైపు మళ్లుతారన్న అంచనాలతో ఆ సంస్థ షేరు బుధవారం పెరిగింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కి చెందిన పలు విమానాలు నిల్చిపోవడంతో వాటిలో కొన్నింటిని తీసుకోవాలని పోటీ సంస్థ స్పైస్‌జెట్‌ యోచిస్తోంది. ఇటీవల నిషేధం వేటుపడిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం 12 విమానాలను పక్కనపెట్టాల్సి రావడంతో స్పైస్‌జెట్‌ విమానాల కొరత ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలను తీసుకోవడంపై దృష్టి సారించింది. అటు జెట్‌ ఎయిర్‌వేస్‌ గానీ దివాలా తీస్తే.. తమ విమానాలు భారత్‌లోనే చిక్కుబడిపోతాయన్న భయంతో లీజుకిచ్చిన సంస్థలు (లెస్సర్లు) కూడా స్పైస్‌జెట్‌ వెంటపడుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 50 ఎయిర్‌క్రాఫ్ట్‌లను స్పైస్‌జెట్‌కు లెస్సర్లు ఆఫర్‌ చేసినట్లు పేర్కొన్నాయి.  

మరిన్ని వార్తలు