హోల్‌సేల్‌ కొనుగోళ్లకు ‘వైడర్‌’

20 May, 2017 01:16 IST|Sakshi
హోల్‌సేల్‌ కొనుగోళ్లకు ‘వైడర్‌’

► ఆన్‌లైన్‌లో రిటైలర్ల గంపగుత్త కొనుగోళ్లు
► 3 వేల మంది హోల్‌సెల్లర్స్‌; 50 వేల రిటైలర్ల నమోదు
► గత నెల రూ.16 కోట్ల జీఎంవీ; ఆదాయం రూ.2 కోట్లు
► 2 నెలల్లో 10–15 మిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ
► ‘స్టార్టప్‌ డైరీ’తో వైడర్‌ ఫౌండర్‌ సీఈఓ దేవేశ్‌ రాయ్‌  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘‘దేశంలో హై ఎండ్‌ బ్రాండ్స్‌ విపణి వాటా 5–6 శాతం మాత్రమే! ఇందుకు కారణమేంటంటే.. ఆయా బ్రాండ్లు మెట్రో నగరాలకే పరిమితం కావటం! అలా అని పట్టణాలు, గ్రామాల్లోని రిటైలర్లు వీటిని కొనలేరని కాదు.. వారికి ఆయా బ్రాండ్ల ఉత్పత్తులను కొనేందుకు సరైన వేదికంటూ లేకపోవటమే’’ ఇదే ఆలోచనను వ్యాపారంగా మార్చుకుంది ‘వైడర్‌’.

ఒకటీరెండూ కాదు! ఏకంగా 1,000 బ్రాండ్లు తమ ఉత్పత్తుల విక్రయానికి వైడర్‌ను వేదికగా ఎంచుకున్నాయి. గుర్గావ్‌ కేంద్రంగా 2016 మార్చిలో ప్రారంభమైన వైడర్‌.ఇన్‌.. సేవల గురించి మరిన్ని వివరాలు సంస్థ వ్యవస్థాపక సీఈఓ దేవే‹శ్‌ రాయ్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. అవి...

‘‘వైడర్‌ గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే.. తయారీ సంస్థలు, హోల్‌సెల్లర్లను రిటైలర్లతో కలపటమే మా పని. దీంతో పాటూ విక్రయదారులు సొంత ఆన్‌లైన్‌ స్టోర్‌ ఏర్పాటు చేసుకుంటే టెక్నాలజీ, ఉత్పత్తుల నిర్వహణ, కేటలాగ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సేవలందిస్తాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3 వేల మంది హోల్‌సెల్లర్స్‌ నమోదయ్యారు.

ఇందులో 400 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఉన్నారు. రిటైలర్లు 50 వేల మంది నమోదయ్యారు. ప్రస్తుతం వైడర్‌లో ఫ్యాషన్, జ్యుయలరీ, బేబీ కేర్, స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్, హోమ్‌సప్లైయిస్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కిచెన్‌ వేర్, హోమ్‌ ఫర్నిషింగ్, డెకర్, ఆటోమోటివ్‌ వంటి 15 కేటగిరీల్లో 6 లక్షలకు పైగా ఉత్పత్తులున్నాయి. వీటి విలువ రూ.5 వేల కోట్ల పైనే ఉంటుంది. వైడర్‌ వేదికగా రిటైలర్లు కొనుగోలు చేసే ఉత్పత్తులను బట్టి హోల్‌సెల్లర్స్‌ నుంచి 3–15% కమీషన్‌ తీసుకుంటాం. రిటైలర్ల నుంచి లాజిస్టిక్స్‌ కోసం రూ. 2–200 వరకూ చార్జీలు తీసుకుంటాం.

నెలకు రూ.2 కోట్ల ఆదాయం..
ప్రతి నెలా 12 వేల లావాదేవీలు అంటే సుమారు లక్ష ఉత్పత్తుల ఆర్డర్లు జరుగుతున్నాయి. ఇందులో 2 వేల లావాదేవీలు తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటాయి. ఉత్పత్తుల డెలివరీకి డెల్హివరీ, బ్లూడార్ట్‌ వంటి 20కి పైగా లాజిస్టిక్‌ సంస్థలతో జట్టుకట్టాం. గత నెల రూ.16 కోట్ల జీఎంవీ (గ్రాస్‌ మర్చంటెస్‌ వ్యాల్యూ) జరగ్గా.. ఇందులో రూ.2 కోట్ల ఆదాయం ఆర్జించాం. రిటైలర్లు కనీస ఉత్పత్తు ల కొనుగోళ్ల విలువ రూ.15 వేల వరకూ ఉండాలి.

2 నెలల్లో నిధుల సమీకరణ..
‘‘ప్రస్తుతం సంస్థలో 80 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి 15 వేల మంది హోల్‌సెల్లర్స్, లక్షన్నర మంది రిటైలర్ల నమోదు లకి‡్ష్యంచాం. కొత్తగా మరో 150 మంది ఉద్యోగులను నియమించుకోనున్నాం. ఇప్పటివరకు సీడ్, సిరీస్‌ ఏ రౌండ్లలో కలిపి 5 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాం. జంగ్లీ, బెస్సీమర్, స్టెల్లరీస్‌ వెంచర్స్‌ పార్టనర్స్‌ పెట్టుబడులు పెట్టాయి. మరో 2 నెలల్లో 10–15 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సమీకరించనున్నాం. ఇందులో పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్త వాళ్లూ పాల్గొంటారు’’ అని దేవేష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు