కోల్ ఇండియా ఆఫర్ ధర రూ. 358

30 Jan, 2015 02:05 IST|Sakshi
కోల్ ఇండియా ఆఫర్ ధర రూ. 358

నేడు ఓఎఫ్‌ఎస్ ద్వారా 10% వరకూ వాటా విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో వాటా విక్రయానికి కనీస షేరు ధరను(ఫ్లోర్ ప్రైస్) ప్రభుత్వం రూ.358గా నిర్ణయించింది. శుక్రవారం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో  కేంద్రం 10 శాతం వరకూ వాటాను విక్రయించనుంది. గురువారం బీఎస్‌ఈలో కోల్ ఇండియా షేరు ముగింపు ధర రూ.375.15తో పోలిస్తే ప్రభుత్వం ప్రకటించిన కనీస షేరు ధర దాదాపు 5% తక్కువ కావడం గమనార్హం.

ఈ ఫ్లోర్ ప్రైస్ ప్రకారం చూస్తే.. 10% వాటా విక్రయం ద్వారా ఖజానాకు రూ.22,600 కోట్లు లభించే అవకాశాలున్నాయి. కాగా, ఈ వాటా అమ్మకానికి వ్యతిరేకంగా గురువారం సంస్థ కార్మిక యూనియన్లు సమ్మె హెచ్చరికలు చేసినా.. ప్రభుత్వం మాత్రం వెనక్కితగ్గకపోవడం గమనార్హం. నేడు బైటాయింపులతో నిరసన వ్యక్తం చేయనున్నట్లు కార్మిక యూనియన్లు తెలిపాయి. దేశీ స్టాక్ మార్కెట్లలో ఇప్పటిదాకా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ(2010 అక్టోబర్‌లో ఐపీఓ ద్వారా రూ.15,199 కోట్ల సమీకరణ) కోల్ ఇండియాదే. ఇప్పుడు ఓఎఫ్‌ఎస్‌తో వాటా విక్రయం చేపడుతున్న కోల్ ఇండియా మరో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూతో కొత్త రికార్డును నెలకొల్పనుంది.
 
రిటైలర్లకు 5 శాతం డిస్కౌంట్...
మొత్తం విక్రయానికి ఉంచనున్న 63.17 కోట్ల షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్లకు 20 శాతాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాకుండా రిటైలర్లకు బిడ్డింగ్ ధరలో 5 శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది. ప్రస్తుతం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 89.65 శాతం వాటా ఉంది.
 ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో రూ.43,425 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి మరో రెండు నెలలే గడువు మిగలగా.. ఇప్పటిదాకా రూ.1,715 కోట్లే(సెయిల్‌లో గతేడాది డిసెంబర్‌లో 5 శాతం వాటా అమ్మకం ద్వారా) లభించాయి.

మరిన్ని వార్తలు