స్టాక్‌ మార్కెట్‌కు సెన్సెక్స్, నిఫ్టీలే ప్రామాణికం ఎందుకు?

26 Dec, 2016 01:11 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్‌కు సెన్సెక్స్, నిఫ్టీలే ప్రామాణికం ఎందుకు?

స్టాక్‌ మార్కెట్‌కు ప్రామాణికంగా ప్రధాన ఇండెక్స్‌లనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇండెక్స్‌లో వివిధ రంగాలకు చెందిన పలు కంపెనీల స్టాక్స్‌ ఉంటాయి. దేశంలో చాలా స్టాక్‌ ఎక్స్చేంజీలు ఉన్నాయి. కానీ బాంబే స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లు మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి. బీఎస్‌ఈ 1875లో ఏర్పాటయ్యింది. దీని ప్రామాణిక ఇండెక్స్‌ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌. సెన్సెక్స్‌లో 30 స్టాక్స్‌ ఉంటాయి. ఇవి వివిధ రంగాల్లోని పెద్ద, ఆర్థికంగా బలమైన, షేర్లలో అధిక లిక్విడిటీ ఉన్న కంపెనీలకు చెందినవి. ఇక ఎన్‌ఎస్‌ఈ 1992లో ప్రారంభమైంది. దీని బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సీఎన్‌ఎక్స్‌ నిఫ్టీ. నిఫ్టీలో 23 రంగాలకు చెందిన 50 ప్రముఖ స్టాక్స్‌ ఉంటాయి. ఈ రంగాలకు సూచీలో ఎంతమేర వాటా ఉందో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్స్‌లో చూడొచ్చు.

సెన్సెక్స్, నిఫ్టీలలో బాగా ట్రేడయ్యే వివిధ రంగాలకు చెందిన లార్జ్‌ క్యాప్‌ కంపెనీల స్టాక్స్‌ ఉంటాయి. అందుకే ఆయా రంగానీలకు చెందిన ఏ చిన్న వార్త అయినా.. సంబంధిత కంపెనీ స్టాక్‌ విలువను ప్రభావితం చేస్తుంది. అంటే సంబంధిత షేరు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అలాగే ఈ కంపెనీలు ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. అందుకే స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చిన్న చిన్న అంశాల వల్ల కూడా ఇవి ప్రభావితమవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే ఈ కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండెక్స్‌లు కూడా పెరగడం కానీ, తగ్గడం కానీ జరుగుతుంది. అందుకే సెన్సెక్స్, నిఫ్టీలను ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించే ప్రధాన సూచీలుగా భావిస్తారు. సెన్సెక్స్‌ లేదా నిఫ్టీ హిస్టారికల్‌ ట్రెండ్స్‌(గత ధోరణి)ను విశ్లేషించడం ద్వారా కూడా భారత ఈక్విటీ మార్కెట్‌ వృద్ధిని అంచనా వేయవచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు