2015లో అందుబాటులోకి రానున్న విండోస్ 10

7 Oct, 2014 12:20 IST|Sakshi
2015లో అందుబాటులోకి రానున్న విండోస్ 10

 విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను మైక్రోసాప్ట్ లాంఛ్‌ చేసింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో  గత నెల 30న ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా కార్యక్రమంలో దీనిని విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో విండోస్‌ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఉంది.  విండోస్ 8ని 2012లో విడుదల చేశారు. దీనికి అంతగా ఆదరణ లభించలేదు. దీని తరువాత విండోస్‌ 9 వస్తుందని అందరూ ఎదురుచూస్తుండగా  అనూహ్యంగా మైక్రోసాప్ట్  ఏకంగా విండోస్‌ 10ను  విడుదల చేసింది. ఈ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఎంటర్‌ప్రైజ్‌ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే  వెర్షన్ 2015లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

ఒకప్పుడు విండోస్‌లో కొత్త వెర్షన్‌ వస్తోందంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొనేది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్, ఐప్యాడ్‌  కారణంగా  విండోస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌పై వినియోగదారులకు ఆసక్తి తగ్గింది. కంపెనీలు, ప్రభుత్వాలు తప్పితే ఇతరులు విండోస్‌ వాడకాన్ని బాగా తగ్గించారు. ఈ పరిస్థితుల్లో  మైక్రోసాప్ట్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మీద ఎక్కువగా దృష్టి పెడుతోంది. విండోస్‌ను కూడా మొబైల్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ విండోస్‌ మార్కెట్‌ వాటాను పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్ని చేసినా విండోస్‌కు పూర్వ వైభవం దక్కే అవకాశం లేదని పరిశీలకుల అంచనా. అయితే క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో మాత్రం మైక్రోసాప్ట్కు మంచి పట్టు లభిస్తుందని భావిస్తున్నారు.

ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కంప్యూటర్లు, టాబ్లెట్స్‌, ఫోన్లు... అన్నింటికీ ఉపయోగపడుతుందని మైక్రోసాప్ట్ సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు తాము విడదల చేసిన ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అత్యుత్తమంగా నిలుస్తుందని మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ హెడ్ టెర్రీ మైర్సన్ చెప్పారు.
**

>
మరిన్ని వార్తలు