విప్రో లాభం 8% డౌన్‌

20 Jan, 2018 00:01 IST|Sakshi

క్యూ3లో రూ. 1,931 కోట్లు

రూ. 1 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీ ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 8.4 శాతం క్షీణించింది. రూ.1,931 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సంస్థ నికర లాభం రూ.2,110 కోట్లు. మరోవైపు ఆదాయం సైతం రూ.13,688 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.13,669 కోట్లకు పరిమితమైంది.

కీలకమైన ఐటీ సేవల విభాగం ఆదాయాలు డాలర్ల రూపంలో 2.013 బిలియన్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే పెద్ద మార్పు లేకపోయినా.. వార్షిక ప్రాతిపదికన మాత్రం 5.8 శాతం మేర పెరిగాయి. అయితే, మూడో త్రైమాసికానికి విప్రో స్వయంగా ఇచ్చిన ఆదాయాల గైడెన్స్‌ను అందుకోలేకపోవడం గమనార్హం. క్యూ3లో ఆదాయం 2.014 – 2.054 బిలియన్‌ డాలర్ల దాకా ఉండొచ్చని విప్రో గతంలో గైడెన్స్‌ ఇచ్చింది.

ఒక క్లయింట్‌ ఖాతాకు సంబంధించి 49.7 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 317.5 కోట్లు) ప్రొవిజనింగ్‌ చేయాల్సి రావడం వల్ల ఐటీ సేవల మార్జిన్‌పై ప్రభావం పడి  14.8 శాతానికి పరిమితమయిందని విప్రో పేర్కొంది. ప్రొవిజనింగ్‌ చేయని పక్షంలో మార్జిన్‌ మరింత అధికంగా 17.2 శాతం స్థాయిలో ఉండేదని తెలిపింది.

మార్చి క్వార్టర్‌కి 2,073 మిలియన్‌ డాలర్ల గైడెన్స్‌..: రాబోయే త్రైమాసికంలో ఐటీ సర్వీసుల విభాగం ఆదాయాలు 2,033 – 2,073 మిలియన్‌ డాలర్ల మేర ఉండగలవని అంచనా వేస్తున్నట్లు విప్రో తెలిపింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగాలతో పాటు హెల్త్‌కేర్‌ విభాగంలోను పనితీరు మెరుగుపర్చుకుంటున్నామని విప్రో సీఈవో ఆబిదాలి జెడ్‌ నీముచ్‌వాలా తెలిపారు.

ఈ ప్రభావం వచ్చే త్రైమాసికం అంచనాల్లో ప్రతిఫలిస్తోందన్నారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో 25 శాతం వాటా డిజిటల్‌ విభాగానిదే ఉంటోంది. డిసెంబర్‌ చివరి నాటికి కంపెనీ సిబ్బంది సంఖ్య 1.62 లక్షలు. బీఎస్‌ఈలో విప్రో షేరు ధర 0.74% పెరిగి రూ.328.45 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు