విప్రో.. భలే దూకుడు

15 Jul, 2020 10:50 IST|Sakshi

17 శాతం దూసుకెళ్లిన షేరు

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

భవిష్యత్‌ పనితీరుపై ఆశలు

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఈ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో విప్రో షేరు ప్రస్తుతం 17 శాతం దూసుకెళ్లింది. రూ. 263 వద్ద ట్రేడవుతోంది.  తొలుత రూ. 269 సమీపానికి ఎగసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం తగ్గినప్పటికీ లాభదాయకత పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడింగ్‌ ప్రారంభమైన అర్ధగంటలోనే ఈ కౌంటర్లో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో కలిపి 31.4 మిలియన్‌ షేర్లు చేతులు మారడం గమనార్హం! ఫలితాల తీరు, ఇతర వివరాలు చూద్దాం..

19 శాతం
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఐటీ సర్వీసుల నిర్వహణ లాభ(ఇబిట్‌) మార్జిన్లు19 శాతంగా నమోదయ్యాయి. ఇందుకు అధిక యుటిలైజేషన్‌, వ్యయ నియంత్రణ, నీరసించిన రూపాయి దోహదపడినట్లు నిపుణులు తెలియజేశారు. విశ్లేషకులు 16.6 శాతం మార్జిన్లను అంచనా వేశారు. త్రైమాసిక ప్రాతిపదికన ఐటీ సర్వీసుల ఆదాయం డాలర్లలో 7.5 శాతం క్షీణించింది. కాగా.. పన్నుకు ముందు లాభం 4.4 శాతం బలపడి రూ. 3095 కోట్లకు చేరింది.  ఇక నికర లాభం సైతం 2.7 శాతం మెరుగుపడి రూ. 2390 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 14,913 కోట్లను తాకింది.

ఇకపై
డీల్‌ పైప్‌లైన్‌ ఆధారంగా చూస్తే భవిష్యత్‌లో విప్రో మరింత మెరుగైన పనితీరును చూపే వీలున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది. డిజిటల్‌ విభాగంలో ముందడుగుతోపాటు.. కన్జూమర్‌ బిజినెస్‌, ఎనర్జీ, యుటిలిటీ విభాగాలలో సాధించిన డీల్స్‌ ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు భావిస్తోంది. గత కొన్నేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ సేవల బ్లూచిప్‌ కంపెనీలలో విప్రో అండర్‌ పెర్ఫార్మర్‌గా నిలుస్తున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇందుకు హెల్త్‌కేర్‌, ఈఎన్‌యూ వంటి విభాగాలలో ఎదురైన సవాళ్లు కారణమైనట్లు తెలియజేసింది. అయితే ఈ విభాగాలు ఇకపై పటిష్ట పనితీరు ప్రదర్శించే వీలున్నదని అభిప్రాయపడింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా