విప్రో ఫలితాలు ఓకే

18 Apr, 2014 01:23 IST|Sakshi
విప్రో ఫలితాలు ఓకే

బెంగళూరు: దేశీ ఐటీ దిగ్గజం విప్రో ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2013-14, క్యూ4)లో రూ.2,227 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 1,729 కోట్ల లాభంతో పోలిస్తే(వార్షిక ప్రాతిపదికన) 29 శాతం వృద్ధి నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా వార్షికంగా 21.7 శాతం పెరుగుదలతో రూ.11,704 కోట్లకు చేరింది.

 అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.9,613 కోట్లుగా ఉంది. పరిశ్రమ విశ్లేషకులు, మార్కెట్ నిపుణులు క్యూ4లో కంపెనీ నికర లాభం రూ.2,106 కోట్లుగా, ఆదాయాన్ని రూ.10,541 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో ఐటీ సేవల విభాగం ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)ను అంతంతమాత్రంగానే విప్రో ప్రకటించింది. డాలర్ రూపంలో 1.715-1.755 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని పేర్కొంది.

 డాలరుతో రూపాయి మారకం విలువన 61.62గా పరిగణించి ఈ గెడైన్స్‌ను ఇచ్చింది. కాగా, క్యూ4లో ఆదాయం డాలర్ రూపంలో 1.72 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. సీక్వెన్షియల్‌గా 2.5 శాతం, వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం పెరిగింది. యూరప్‌లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, అమెరికాలో పటిష్టమైన వృద్ధి, మెరుగైన వ్యయ నిర్వహణ వంటివి ఫలితాల జోరుకు కారణాలుగా నిలిచాయి.
 
 సీక్వెన్షియల్‌గా: గతేడాది డిసెంబర్ క్వార్టర్‌లో నికర లాభం రూ.2,015 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా) మార్చి క్వార్టర్‌లో లాభం 10.5 శాతం వృద్ధి చెందింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా 11,327 కోట్ల నుంచి 3.3 శాతం సీక్వెన్షియల్ వృద్ధిని నమోదు చేసుకుంది.
 పూర్తి ఏడాదికి ఇలా: 2013-14 పూర్తి ఏడాదిలో విప్రో నికర లాభం రూ,7,797 కోట్లకు ఎగబాకింది. 2012-13లో రూ.6,636 కోట్లతో పోలిస్తే 17.5% వృద్ధిచెందింది. మొత్తం ఆదాయం రూ.33,685 కోట్ల నుంచి రూ.43,755 కోట్లకు పెరిగింది. 16% వృద్ధి నమోదైంది. ఉత్పాదకత పెంపునకు అనుసరించిన మెరుగైన వ్యూహాలు, కాంట్రాక్టుల అమలు గడువును తగ్గించుకోవడంపై దృష్టిపెట్టడం ద్వారా పటిష్టమైన ఫలితాలను సాధించగలిగామని విప్రో సీఈఓ టీకే కురియన్ చెప్పారు.
 
 ఇతర ముఖ్యాంశాలు..
 ఐటీ సేవల విభాగం ఆదాయం క్యూ4లో రూ.10,619 కోట్లుగా కంపెనీ వెల్లడించింది. సీక్వెన్షియల్‌గా 2.5 శాతం, వార్షిక ప్రాతిపదికన 24% చొప్పున పెరిగింది. పూర్తి ఏడాదికి ఈ విభాగం మొత్తం ఆదాయం 18% వృద్ధితో రూ.39,950 కోట్లకు ఎగసింది.

 క్యూ4లో కొత్తగా 59 మంది క్లయింట్లు జతయ్యారు. ఇందులో 5 మెగా డీల్స్ కూడా ఉన్నాయి.

2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ రూ.2 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. పూర్తి ఏడాదికి డివిడెండ్ మొత్తం రూ. 8కి చేరింది.

 మార్చి చివరినాటికి విప్రో ఐటీ సేవల వ్యాపారంలో సిబ్బంది సంఖ్య 1,46,053 మందిగా నమోదైంది.

 ఆఫ్‌షోర్ సిబ్బందికి 6-8 శాతం, ఆన్‌సైట్ ఉద్యోగులకు 2-3 శాతం పెంపుదలకు అవకాశం ఉందని విప్రో సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెచ్‌ఆర్) సౌరభ్ గోవిల్ చెప్పారు.

 ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో
 2.39 శాతం ఎగబాకి రూ.586 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో టేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

మరిన్ని వార్తలు