స్టార్టప్స్‌తో పెరగనున్న సంపన్నులు

3 Aug, 2015 00:36 IST|Sakshi
స్టార్టప్స్‌తో పెరగనున్న సంపన్నులు

2020 నాటికి మరో 12 మంది కొత్త బిలియనీర్లు
 
 న్యూఢిల్లీ : భారత్‌లో బిలియనీర్ల, మిలియనీర్ల సంఖ్య మరింత పెరగనుంది. దేశంలో 2020 నాటికి కొత్తగా 12 మందికిపైగా బిలియనీర్లు అవతరిస్తారనే విషయం అసోచామ్ సర్వేలో వెల్లడైంది. దీనికి స్టార్టప్స్ బూమ్ కారణమని పేర్కొంది. స్టార్టప్స్ జోరుకు ఈ-కామర్స్, ఎంటర్‌టైన్‌మెంట్, పేమెంట్ గేట్‌వేస్, రేడియో ట్యాక్సీ, టెక్నాలజీ సంబంధిత రంగాలు బాగా ఊతమిస్తున్నాయని, ఆయా రంగాల్లో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని వివరించింది. రానున్న కాలంలో ఆసియా స్టార్టప్ దిగ్గజ దేశాల సరసన భారత్ కూడా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేసింది.

చైనాలో మాదిరిగా భారత్‌లో స్టార్టప్‌ల వృద్ధికి సంబంధించిన నిర్మాణాత్మక సమస్యలు లేవని తెలిపింది. ట్రావెలింగ్ రంగంలో ముఖ్యంగా టికెట్, బుకింగ్ విభాగాలకు మంచి డిమాండ్ ఉందని పేర్కొంది. అలాగే ఈ-కామర్స్ రంగంలో కిరాణా, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ వస్తు విభాగాల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్, సినిమా టికెటింగ్ వంటి అంశాలకు మంచి ఆదరణ లభించిందని వివరించింది. బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ వల్ల చిన్న చిన్న పట్టణాలకు కూడా ఇంటర్నెట్ వ్యాప్తి జరిగితే ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. పలు రంగాల్లోని స్టార్టప్‌లపై ఇన్వెస్టర్లు ఆసక్తిని కనబరుస్తున్నారని తెలిపింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి స్టార్టప్‌లు నిధులను సమీకరించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనువైన పరిస్థితులను సృష్టిస్తున్నప్పటికీ ఆ విధంగా నిధులను సమీకరించడానికి మరింత సమయం పడుతుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు