కేంద్ర స్కీమ్‌లతో స్టాక్ మార్కెట్‌కు జోష్

26 Jun, 2015 01:35 IST|Sakshi
కేంద్ర స్కీమ్‌లతో స్టాక్ మార్కెట్‌కు జోష్

గృహ నిర్మాణానికి సంబంధించి మూడు కొత్త పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. గృహనిర్మాణానికి, పట్టణాభివృద్ధికి సరికొత్త జోష్‌నిచ్చే ఈ పథకాల వల్ల రియల్టీ, బ్యాంక్ షేర్లలో ర్యాలీ జరిగింది. గ్రీస్ రుణ సంక్షోభాన్ని స్టాక్ మార్కెట్ పట్టించుకోలేదు.  బీఎస్‌ఈ సెన్సెక్స్ 166 పాయింట్లు లాభపడి 27,896 పాయింట్ల వద్ద, నిఫ్టీ 37పాయింట్ల లాభంతో 8,398 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగుస్తున్న నేపథ్యంలో ఆపరేటర్లు షార్ట్ కవరింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారని దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు లాభపడ్డాయని నిపుణులంటున్నారు.

 ఈపీఎఫ్‌ఓ ఇన్వెస్ట్‌మెంట్స్
  వచ్చే నెల నుంచి ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తుందన్న వార్త స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు జోష్‌నిచ్చిందని వెరాసిటి గ్రూప్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మ్‌భట్ చెప్పారు.  

 వెలుగులో హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు... అమృత్, స్మార్ట్ సిటీ, అందరికీ ఇళ్లు.. ఈ మూడు పథకాల ప్రారంభం కారణంగా గృహ రుణాలిచ్చే ఆర్థిక సంస్థలకు డిమాండ్ కనిపించింది. హెచ్‌డీఎఫ్‌సీ 2.2 శాతం, ఎల్‌ఐసీ హౌసింగ్ 0.5 శాతం, దివాన్ హౌసింగ్ 2.4 శాతం చొప్పున పెరిగాయి.   టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,556 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.20,798 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.5,37,621 కోట్లుగా నమోదైంది.

>
మరిన్ని వార్తలు