ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ఉపసంహరించండి!

19 Sep, 2017 00:52 IST|Sakshi
ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ఉపసంహరించండి!

జైట్లీకి బ్యాంక్‌ యూనియన్ల విజ్ఞప్తి  
న్యూఢిల్లీ:
ఎఫ్‌ఆర్‌డీఐ (ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌) బిల్లు, 2017ను ఉపసంహరించుకోవాలని బ్యాంక్‌ యూనియన్లు ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశాయి.  ఆర్థిక సంస్థల మూసివేతకు సంబంధించి ప్రస్తుత చట్టాల ప్రకారమే పలు నియమ, నిబంధనలు ఉన్నాయని, ఈ అంశంపై కొత్త చట్టం ఏదీ అవసరం లేదని ఆర్థికమంత్రికి సమర్పించిన ఒక వినతిపత్రంలో యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) పేర్కొంది.

తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా బీమా కంపెనీల మూసివేత నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఒక అథారిటీకి అప్పగించడం ప్రధాన ఉద్దేశంగా ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిని గత నెల్లో ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అధ్యయనం, సిఫారసుల నిమిత్తం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన 30 మంది సభ్యుల కమిటీకి దీనిని నివేదించారు. కాగా బ్యాంకింగ్‌ రుణ ఉద్దేశపూర్వక ఎగవేతలను నేరపూరిత చర్యగా ప్రకటించాలని కూడా తమ వినతిపత్రంలో యూఎఫ్‌బీయూ ఆర్థికమంత్రిని కోరింది.

సామాన్యునిపై ‘సేవల’ భారం సరికాదు
మరోవైపు పెద్ద కంపెనీల రుణ ఎగవేతల వల్ల తలెత్తే ఆదాయ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ‘మరిన్ని సేవల చార్జీల’ పేరుతో సామాన్య బ్యాంకింగ్‌ కస్టమర్లపై భారం మోపడం సరికాదని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీఓసీ) జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ రవీంద్ర గుప్తా మరో ప్రకటనలో స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు