ఆమె నా రోల్‌ మోడల్‌ : ఆనంద్‌ మహింద్రా

14 Aug, 2018 15:35 IST|Sakshi
ఆనంద్‌ మహింద్రా (ఫైల్‌ ఫోటో)

‘పట్టించుకుంటే వయసు సమస్య అవుతుంది. ఒక్కవేళ దాన్ని పట్టించుకోకపోతే అది అసలు సమస్యే కాదు’ అమెరికన్‌ రచయిత, వ్యాపారవేత్త మార్క్‌ ట్వైన్‌ చెప్పిన సంగతి సుపరిచితమే. అచ్చం ఆ రచయిత చెప్పిన మాదిరి తన వయసు గురించి అసలు పట్టించుకోకుండా.. అటూ ఇటూ సరిగ్గా నడవలేని స్థితిలో కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన ఓ 96 ఏళ్ల బామ్మ నాలుగు తరగతి చదువుతోంది. చదువుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తూ.. పలువురికి రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది. కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ వాళ్లు నిర్వహించిన అక్షర లక్ష్యం లిటరసీ పరీక్షల్లో కార్త్యాయిని అమ్మ వందకు వంద మార్కులు సాధించింది. ఈ మిషన్‌ ఆధ్వర్యంలోనే ఆమె నాలుగో తరగతి చదువుతోంది. అక్షర లక్ష్యం స్కీమ్‌ టెస్ట్‌లో పాల్గొన్న పెద్ద వయసున అభ్యర్థి ఈ బామ్మనేనని తెలిసింది. ఈ బామ్మ ఇప్పుడు పలువురికి రోల్‌ మోడల్‌గా నిలువడం విశేషంగా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహింద్రాకు కూడా ఈమెనే రోల్‌ మోడల్‌ అట. ‘ఇది నిజం, ఆమెనే ఇప్పుడు నా రోల్‌ మోడల్‌. ఆమెలాగా నేర్చుకోవాలనే తపన ఉంటే నా మెదడు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది’ అని మహింద్రా ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా కార్త్యాయిని  అమ్మనే నిలిచింది. ట్విటర్‌ యూజర్లు ఆమెను పొగడ్తతలతో ముంచెత్తుతున్నారు. 

నేర్చుకోవాలనే తపన ఉండే వారికి, వయసు ఎప్పుడూ సమస్యే కాదడానికి కార్త్యాయిని అమ్మ ఉదాహరణగా నిలుస్తుందని యూజర్లు అంటున్నారు. కేరళ అంటేనే అక్షరాస్యతకు పెట్టింది పేరని తెలుసు. అక్షరాస్యతలో దేశంలోనే ఆ రాష్ట్రం టాప్‌లో ఉంటుంది. అయితే.. వృద్ధుల్లో చాలా మంది చదువుకున్న వాళ్లు లేకపోవడంతో బ్యాలెన్స్ చేయడం కోసం కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ ద్వారా అక్షర లక్ష్యం స్కీమ్‌ను ప్రారంభించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆ మిషన్‌లోనే ఇప్పుడు కార్త్యాయిని చదువుతుంది. ఆమెతో పాటు మొత్తం 40,363 మంది వృద్ధులు ఈ మిషన్ ద్వారా తమ చదువును కొనసాగిస్తున్నారు. కాగ, ప్రతిభను ఆనంద్‌ కొనియాడటం ఇదే తొలిసారి కాదు. సుమారు 15 భాషలు మాట్లాడే రవి చేకల్యా అనే యంగ్‌ బాయ్‌ను కూడా ఆనంద్‌ ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు