బ్యాంకుల విలీనంపై కమిటీ

6 Mar, 2016 01:50 IST|Sakshi
బ్యాంకుల విలీనంపై కమిటీ

బిజినెస్
గుర్గావ్: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన అంశంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఎక్కువ బ్యాంకులకన్నా పటిష్టమైన బ్యాంకులు అవసరమని శనివారమిక్కడ రెండో విడత జ్ఞాన సంగం ముగింపు కార్యక్రమంలో అన్నారు. రూ. 8 లక్షల కోట్ల పైగా పేరుకుపోయిన మొండి బకాయిల సమస్య పరిష్కారం కోసం డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, సంబంధిత చట్టాలను పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులకు ఎసాప్స్(ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్) కూడా ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

బ్యాంకుల కన్సాలిడేషన్ అంశాన్ని కూడా జ్ఞాన సంగంలో చర్చించామని, బ్యాంకర్లే నిపుణుల కమిటీ ఏర్పాటును సూచించారని చెప్పారు. బ్యాంకు ఉద్యోగులకు ప్రోత్సాహకాల కింద షేర్ల కేటాయింపు అంశం కూడా చర్చకు వచ్చిందని, ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తోందని జైట్లీ తెలిపారు. ఇక మొండిబకాయిల కట్టడి దిశగా విద్యుత్, హైవేలు, చక్కెర, ఉక్కు తదితర రంగాల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. బ్యాంకులు సైతం మొండి బకాయిలను రాబట్టడానికి చర్యలు తీసుకుంటున్నాయన్నారు.

మరిన్ని వార్తలు