మహిళకు.. వెల్‌కమ్‌!

7 Jul, 2020 05:19 IST|Sakshi

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో భారీ అవకాశాలు

ఏ షిఫ్ట్‌కు అయినా పనిచేసే వీలు

దీంతో నియామకాల్లో వారికి ప్రాధాన్యం

ఇంటి నుంచే అన్ని బాధ్యతల నిర్వహణ

పని ప్రదేశాల్లో జోరుగా మహిళల ప్రాతినిధ్యం

న్యూఢిల్లీ: పనివేళలు సౌకర్యంగా లేకపోవడం.. ఇంటి నుంచి పని చేసే అవకాశాలు తక్కువగా ఉండడం.. ఇటువంటి సమస్యలు ఇంతకాలం ఉద్యోగ రంగంలో మహిళల పాత్రను పరిమితం చేశాయి. కానీ, ఇప్పుడు కరోనాతో ఇది మారిపోనుంది. దీని కారణంగా పలు రంగాల్లో.. ముఖ్యంగా ఐటీ రంగంలో 75–90 శాతం మంది ఇప్పుడు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (ఇంటి నుంచే కార్యాలయ పని).. విధానంలోనే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ మార్పులతో మరింత మంది మహిళలు కెరీర్‌ వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘ప్రతిభావంతులైన ఎంతో మంది మహిళలు, ఎన్నో నైపుణ్యాలు ఉండి కూడా వ్యక్తిగత కారణాల రీత్యా ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు వారు తిరిగి ఐటీ రంగంలోకి బలంగా వచ్చే అవకాశం ఉంది’’ అని ఎస్సార్‌ గ్రూపు హెచ్‌ఆర్‌ ప్రెసిడెంట్‌ కౌస్తుభ్‌ సోనాల్కర్‌ పేర్కొన్నారు. ఇంటి నుంచే పని విధానంతో మహిళలు తిరిగి ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు, పార్ట్‌టైమ్‌ (పరిమిత సమయం) ఉద్యోగాలు చేసుకునేందుకు చక్కని అవకాశం ఏర్పడిందన్నారు.  

మహిళలకు ప్రాధాన్యం..
క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విభాగంలో పనిచేసే సేల్స్‌ఫోర్స్‌ కంపెనీకి భారత్‌లో 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరింత మంది మహిళలను నియమించుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. తద్వారా ఉద్యోగుల విషయంలో మరింత సమతుల్యతను తీసుకురానున్నట్టు తెలిపింది. ‘‘ఉద్యోగులు ఇంటి నుంచే శాశ్వతంగా పనిచేసేందుకు మరిన్ని కంపెనీలు అనుమతించనున్నాయి. ఇది మహిళలకు అనుకూలమైన పరిస్థితులను, అవకాశాలను కల్పించనుంది. వ్యక్తిగత బాధ్యతలను నెరవేరుస్తూనే వారు తమ కెరీర్‌ను తిరిగి ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది’’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా డైరెక్టర్‌ నిధి అరోరా అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌లో భద్రతా కారణాల రీత్యా రాత్రి షిఫ్ట్‌లకు మహిళలను అంతగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. కరోనా కారణంగా భిన్నమైన ధోరణులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు అన్ని రకాల ఉద్యోగాలకు వారు అర్హులే. మరింత మంది మహిళలు ఉపాధి అవకాశాలను సొంతం చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘వర్కింగ్‌ మదర్‌ మీడియా’ ప్రెసిడెంట్‌ సుభ వి బ్యారీ తెలిపారు.  

‘బ్యాలెన్స్‌’ అవకాశం
పనిచేసే చోట సాధారణంగా స్త్రీ/పురుష ఉద్యోగుల విషయంలో సంఖ్యా పరంగా ఎంతో అంతరం కనిపిస్తుంటుంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం ఇప్పుడు ఈ అంతరాన్ని సరిచేసే అవకాశం కానుందా..? అన్నదానికి ఏడీపీ ఇండియా హెచ్‌ఆర్‌ హెడ్‌ విపుల్‌సింగ్‌ స్పందిస్తూ.. ‘‘కార్యాలయాలకు వెళ్లే అవకాశం ఇవ్వనందుకే మహిళలు ఉద్యోగాల నుంచి తప్పుకోవడం లేదు. సామాజికంగా, మానసికంగా, వ్యక్తిగత అవసరాల కోసం వారి జీవితంలో కొంత వ్యవధి కావాలి. అందుకే వారు ఉద్యోగాల విషయంలో రాజీపడాల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో అన్నింటిని సమతుల్యం చేసుకోగలరు’’ అంటూ భవిష్యత్తు ధోరణి గురించి వివరించారు. గత రెండేళ్లలో మహిళా ఉద్యోగుల శాతం 35% నుంచి 25%కి పడిపోయిందని.. ఇప్పుడు మళ్లీ పుంజుకోనుందని యాక్సెంట్‌ హెచ్‌ఆర్‌ సీఈవో సుబ్రమణ్యమ్‌ చెప్పారు. వేతనాల్లో అం తరం ఉండడం కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగేందుకు సానుకూలించే అంశంగా పేర్కొన్నారు.

వేతనాలదీ కీలకపాత్రే...
‘‘పని పరంగా పురుషులకు ఏ మాత్రం తక్కువ కాకపోయినా.. పారితోషికాల విషయంలో మహిళలకు 20% తక్కువే చెల్లిస్తున్నాయి కంపెనీలు. ఇది మహిళలకు ప్రతికూలమే అయినా, పరిశ్రమకు లాభదాయకం. సౌకర్యమైన పనివేళలు లేదా ఉత్పత్తి ఆధారిత చెల్లింపుల దిశగా పరిశ్రమలు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇలా చేస్తే మహిళలకు ఉపాధి పరంగా మరిన్ని అవకాశాలకు ద్వారాలు తెరుచుకున్నట్టే. ఎందుకంటే ఈ విషయంలో పరిశ్రమలకు కనీస వేతనాల తలనొప్పి కూడా ఉండదు’’ అని సుబ్రమణ్యమ్‌ వివరించారు. రెండో విడత కెరీర్‌ ప్రారంభించాలనుకునే మహిళలకు వర్క్‌ హోమ్‌ హోమ్‌తో భారీ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు