రెరాతో కార్మికుల కొరత!

29 Sep, 2018 03:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)తో స్థిరాస్తి రంగానికి జరిగే ప్రయోజనం సంగతి కాసేపు పక్కన పెడితే.. కార్మికుల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. నిర్మాణంలో నాణ్యత అనేది రెరాలో ప్రధానమైన అంశం. ఇందుకోసం నాణ్యమైన నిర్మాణ సామగ్రితో పాటూ నైపుణ్యమున్న లేబర్స్‌ అవసరమే. కార్మికుల కొరత కారణంగా పెద్ద ప్రాజెక్ట్‌లకు సమస్య అవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

పెరుగుతున్న నిర్మాణ గడువు..
నగరంలో చాలా మంది డెవలపర్లు రెరాలోని ఐదేళ్ల వారంటీ నిబంధనకు భయపడి నిర్మాణ గడువును పెంచుతున్నారని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్‌ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. గతంలో 50 ఫ్లాట్లుండే అపార్ట్‌మెంట్‌ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తే.. ఇప్పుడదే అపార్ట్‌మెంట్‌ను మూడేళ్లలో పూర్తవుతుందని పేర్కొన్నారు.

ఎందుకంటే ఇచ్చిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయని పక్షంలో జరిమానాలు, జైలు శిక్షలున్నాయి. గతంలో అయితే నిర్మాణం కాస్త ఆలస్యమైనా సరే కొనుగోలుదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చు. కానీ, రెరాలో పప్పులేవీ ఉడకవని.. ఎవరైనా కొనుగోలుదారులు రెరా అథారిటీని సంప్రదిస్తే అసలుకే మోసం వస్తుందని ఆయన వివరించారు.

టెక్నాలజీ కీలకం..
నాణ్యమైన కాంట్రాక్టర్స్‌ కొరత పరిశ్రమలో తీవ్రంగా ఉందని.. దీంతో చాలా మంది డెవలపర్లు గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయలేకపోతున్నారని సీబీఆర్‌ఈ దక్షిణాసియా చైర్మన్‌ అన్షుమన్‌ మేగజైన్‌ తెలిపారు.  ఇదే అంతర్జాతీయ నిర్మాణ సంస్థలకు దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాలను కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్తులో నిర్మాణ రంగంలో టెక్నాలజీ కీలకంగా మారుతుందన్నారు. టెక్నాలజీ వినియోగించే కంపెనీలకు ప్రభుత్వం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించాలని సూచించారు. ఉక్కు నిర్మాణాలను నిర్మిస్తే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్‌ టెండర్ల మీద ఆధారపడాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. ఉక్కు నిర్మాణాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు పరిశ్రమ వర్గాలతో పాటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి.

30 శాతం కార్మికుల కొరత..
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న నిర్మాణ కార్మికులు ఒడిశా, బిహార్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలకు చెందినవారే. ఆయా ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు వంటి కార్మికుల కొరత సుమారు 30 శాతం దాకా ఉంది. గ్రామీణ, పట్టణాల్లోని యువత ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లుగా పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ప్రస్తుతం దేశీయ నిర్మాణ రంగంలో 5 కోట్ల మంది కార్మికులుండగా.. ఇందులో నైపుణ్యమున్న కార్మికులు 2 కోట్ల లోపే. సివిల్‌ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్ల కొరత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 6.42 లక్షల మంది సివిల్‌ ఇంజనీర్లు, 65 వేల మంది ఆర్కిటెక్ట్‌లు, 18 వేల మంది ప్లంబర్లు అందుబాటులో ఉన్నారు.

మరిన్ని వార్తలు