సోలార్కు బిలియన్ డాలర్లు!

1 Jul, 2016 00:46 IST|Sakshi
సోలార్కు బిలియన్ డాలర్లు!

న్యూఢిల్లీ: దేశంలో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ దాదాపు రూ.6,750 కోట్ల (1 బిలియన్ డాలర్లు) మేర సాయం అందించనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. భూతాపానికి (గ్లోబల్ వార్మింగ్) దారితీసే ప్రమాదకర వాయువుల విడుదలను నియంత్రించే దిశగా సాంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్... సోలార్ ఎన ర్జీ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. దీనికి ప్రపంచ బ్యాంక్ బాసటగా నిలుస్తోంది.

 2022 నాటికి లక్ష మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
దేశంలో 2022 నాటికి సోలార్ ఎనర్జీ ద్వారా లక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని గోయల్ తెలిపారు. ఇందుకోసం పెట్టుబడులను ఆకర్షించడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ‘పునరుత్పాదక ఇంధన వనరులు, రూఫ్ సోలార్ ప్రాజెక్ట్స్ వంటి తదితర అంశాల గురించి చర్చించాం. ఆర్థిక సాయం కోసం పలు వినూత్న మార్గాలను అన్వేషించాం’ అని చెప్పారు. సోలార్ రూఫ్ టాప్ టెక్నాలజీ, సోలార్ పార్క్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు, కొత్త సోలార్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆవిష్కరణ, ట్రాన్స్‌మిషన్ లైన్స్ స్థాపన వంటి తదితర వాటికి ప్రపంచ బ్యాంక్ నిధులను ఉపయోగిస్తామని వివరించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల సమీకరణకు వీలుగా భారత్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ సోలార్ భాగస్వామ్య బృందం (ఐఎస్‌ఏ)తో ప్రపంచ బ్యాంకు ఒప్పందం చేసుకుంది.

ఐఎస్‌ఏలో 121 దేశాలకు భాగస్వామ్యం ఉంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు తన విభాగమైన ఐఎఫ్‌సీ ద్వారా భారత్‌లో పవన, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు రుణ సహకారం అందిస్తోంది. మధ్యప్రదేశ్‌లో 750 మెగావాట్ల అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకూ నిధులందిస్తోంది. 2030కి సోలార్ విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని మూడింతలు చేయడం సహా భారత్ తన ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకునేందుకు ప్రపంచ బ్యాంకు చేయగలిగినంతా చేస్తుందని కిమ్ స్పష్టం చేశారు. కాగా, కొత్తగా ఏర్పడిన బ్యాంకులు ఎన్‌డీబీ, ఏఐఐబీకు పుష్కల అవకాశాలు ఉన్నాయని, వీటితో పాతతరం సంస్థలకు సవాళ్లు పొంచి ఉన్నాయని కిమ్ వ్యాఖ్యానించారు.  ఇక భారత్ 2015-16 మధ్యకాలంలో ప్రపంచ బ్యాంక్ నుంచి 4.8 బిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకుంది.

మరిన్ని వార్తలు