సమ్మిళిత వృద్ధిలో అట్టడుగున భారత్‌!

23 Jan, 2018 01:19 IST|Sakshi

వర్ధమాన దేశాలలో 62వ స్థానం

చైనా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌ కన్నా దిగువన

దావోస్‌: సమ్మిళిత వృద్ధిలో పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్‌ల కన్నా కూడా భారత్‌ అట్టడుగు స్థాయిలో ఉంది. వర్ధమాన దేశాలకు సంబంధించిన సమ్మిళిత వృద్ధి సూచీలో 62వ స్థానంలో నిల్చింది. చైనా 26, పాకిస్తాన్‌ 47వ స్థానాల్లో ఉండటం గమనార్హం. వర్ధమాన దేశాల జాబితాలో లిథువేనియా అగ్రస్థానంలో నిల్చింది. సంపన్న దేశాల జాబితాలో అత్యంత సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా నార్వే అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది.

వార్షిక సదస్సు నేపథ్యంలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) ఈ సూచీ విశేషాలు విడుదల చేసింది. జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, రుణభారాల నుంచి భవిష్యత్‌ తరాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్‌ని ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది.

ఆర్థిక అభివృద్ధికి జీడీపీ గణాంకాలే కొలమానంగా తీసుకోవడం స్వల్పకాలిక ధోరణులనే చూపుతోందని, అసమానతలకు ఆజ్యం పోస్తోందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో సమ్మిళిత వృద్ధి సాధన కోసం ప్రపంచ దేశాల నేతలు మరో కొత్త విధానాన్ని తక్షణం కనుగొనాల్సిన అవసరం ఉందని సూచించింది.

గతేడాది 79 దేశాల వర్ధమాన దేశాల జాబితాలో భారత్‌ 60వ స్థానంలో నిల్చింది. చైనా 15, పాకిస్తాన్‌ 52వ స్థానాల్లో నిలిచాయి. తాజాగా 2018 సూచీలో భారత్‌ 60వ స్థానం నుంచి 62 స్థానానికి పడిపోగా.. పాకిస్తాన్‌ మాత్రం 47వ స్థానానికి ఎగబాకింది. సమ్మిళిత వృద్ధి సూచీలో మొత్తం 130 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 29 సంపన్న దేశాలు, మిగతా 74 వర్ధమాన దేశాలు ఉన్నాయి. భారత్‌ ఓవరాల్‌ స్కోరు తక్కువగానే ఉన్నప్పటికీ.. పురోగమిస్తున్న టాప్‌ టెన్‌ వర్ధమాన దేశాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.

ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే..
సంపదపరంగానూ, ఆదాయాలపరంగానూ అసమానతలు పెరిగిపోవడానికి కారణం.. దశాబ్దాలుగా సామాజిక సమగ్రాభివృద్ధి కన్నా ఆర్థికాభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటమేనని డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది. దీంతో వృద్ధి ఫలాలు అందరికి అందేలా చర్యలు తీసుకోవడం ద్వారా పర్యావరణాన్ని దెబ్బతియ్యకుండా, భవిష్యత్‌ తరాలపై రుణభారాన్ని మోపకుండా చూడగలిగే అవకాశాన్ని ప్రభుత్వాలు కోల్పోయాయని తెలిపింది.

దేశ ఆర్థిక పనితీరును లెక్కగట్టేందుకు ఆర్థిక వేత్తలు, విధానకర్తలు ఎక్కువగా స్థూల దేశీయోత్పత్తి గణాంకాలపైనే ఆధారపడుతుండటం కూడా ప్రధాన సమస్యల్లో ఒకటని డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. జీడీపీ కేవలం వస్తు, సేవల ఉత్పత్తి లెక్కింపునకు మాత్రమే పరిమితవుతుందే తప్ప.. అవి ఉద్యోగావకాశాలు, ఆర్థిక భద్రత, జీవన ప్రమాణాలు మెరుగుదలను ప్రతిఫలించదని వివరించింది.

టాలెంట్‌ ర్యాంకింగ్‌ మెరుగు ..
ప్రతిభావంతులను ఆకర్షించడంలో భారత్‌ ర్యాంకింగ్‌ మెరుగుపర్చుకుంది. గతేడాది 92వ స్థానంలో ఉన్న భారత్‌ ఈసారి 81వ స్థానానికి ఎగబాకింది. టాలెంట్‌ను ఆకర్షించడంలో పోటీతత్వానికి సంబంధించిన సూచీ వివరాలను డబ్ల్యూఈఎఫ్‌ ప్రకటించింది. భారత్‌కి తీవ్రమైన మేధోవలస రిస్కు పొంచి ఉందని పేర్కొంది. స్విట్జర్లాండ్‌ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సింగపూర్, అమెరికా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.


మరిన్ని విశేషాలు..
సంపన్న దేశాల సమ్మిళిత వృద్ధి సూచీలో నార్వే టాప్‌లో ఉండగా, ఐర్లాండ్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్‌ టాప్‌ 5లో ఉన్నాయి.
వర్ధమాన దేశాల్లో లిథువేనియా అగ్రస్థానంలో, హంగరీ, అజర్‌బైజాన్, లాత్వియా, పోలాండ్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
పొరుగు రాష్ట్రాలైన శ్రీలంక (40), బంగ్లాదేశ్‌ (34), నేపాల్‌ (22 వ ర్యాంకు) భారత్‌ కన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు