అందరికీ అభివృద్ధి ఫలాలు..

10 Oct, 2016 01:25 IST|Sakshi
అందరికీ అభివృద్ధి ఫలాలు..

అందుకు అంతర్జాతీయ సహకారం అవసరం
ఐఎంఎఫ్ వేదికగా ప్రపంచ నేతల పిలుపు
అసమానతలు తొలగించే దిశగా పనిచేయాలి: ఒబామా

వాషింగ్టన్: ప్రపంచ దేశాలు ప్రస్తుతం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా సంపన్నులు, పేద వారి మధ్య అసమానతలు పెరగడానికి దారి తీసిన పరిస్థితుల్లో అభివృద్ధి ఫలాలు అందరినీ చేరుకునేలా విధానాల అమలు విషయంలో అంతర్జాతీయ సహకారానికి నేతలు పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం శనివారం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఒబామాతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక మంత్రులు ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు మరింత సహకారాత్మకంగా, కలసికట్టుగా నడవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.  

 అంతర్జాతీయ ఆర్థిక నమూనా కావాలి
అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రసంగిస్తూ... అంతర్జాతీయ సహకారానికి ఉన్న అడ్డంకులను తొలగించుకుని, అందరి కోసం పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక నమూనాను రూపొందించుకోవాలన్నారు. బలమైన, సమగ్ర, సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఐఎంఎఫ్ తన కృషిని కొనసాగించాలని కోరారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు డిమాండ్‌ను పెంచే ద్రవ్య విధానాలు, నిర్మాణాత్మక సంస్కరణల దిశగా పనిచేయాలని సూచిం చారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాతావరణ మార్పులు, శరణార్థి సమస్యలు, దారిద్య్రాన్ని ఎదుర్కొం టున్న దేశాల్లో పెట్టుబడులు వంటి అంశాల పరిష్కారంలో ముందుండాలని ప్రపంచ బ్యాంకును ఒబామా కోరారు.

 కొద్ది మందికే లబ్ధి: లగార్డ్
ప్రపంచ వృద్ధి దీర్ఘకాలంలో కొద్ది మందికే లబ్ధి చేకూర్చిందని, అసమానతలు ఇప్పటికీ చాలా దేశాల్లో అధిక స్థాయిలో ఉన్నాయని ఐఎంఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టీన్ లగార్డ్ అన్నారు. ఆయా దేశాల్లో వాణిజ్యం అనేది రాజకీయ బంతాటగా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సమగ్ర అభివృద్ధి విధానాల ఆచరణపై దృష్టి పెట్టాలని ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. తక్కువ వృద్ధి, తక్కువ ఉపాధి అవకాశాలు, తక్కువ వేతనాలను తొలగించేలా అవి ఉండాలన్నారు. ‘సమగ్ర అభివృద్ధి కోసం డిజిటల్ యుగానికి మారిపోవాలి. ఆ మార్పుతోనే అందరికీ లబ్ధి కలుగుతుంది. దీన్ని వేగవంతం చేయాలి’ అని లగార్డే పేర్కొన్నారు. వడ్డీ రేట్లు చారిత్రకంగా తక్కువ స్థాయిలో ఉన్నందున హై స్పీడ్ ఇంటర్నెట్, ఇంధన సామర్థ్య రవాణా విధానం, పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు సరైన తరుణమిదేనన్నారు.

తక్కువ వడ్డీ రేట్లతో సమస్యలు: జైట్లీ
తక్కువ, ప్రతికూల వడ్డీ రేట్లు, బ్యాంకింగ్ రంగంలో రుణాల బలహీనత వల్ల ఎదురయ్యే సమస్యలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. వృద్ధిని వేగవంతం చేసేందుకు రుణ భారం తగ్గించుకుని బ్యాలన్స్ షీట్లు మెరుగుపరుచుకోవాలని కోరింది. ఇష్టారీతన ప్రైవేటు రుణాల జారీ సైతం వృద్ధిపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే విధానపరమైన కార్యాచరణ పటిష్టమవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఐఎంఎఫ్ వేదికగా ప్రపంచ దేశాలకు సూచించారు. ఉత్పత్తి, కార్మిక మార్కెట్ సంస్కరణల ద్వారా లబ్ధి పొందడంతోపాటు రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలను పటిష్టం చేసుకోవడం, బ్యాలన్స్ షీట్ల ఒత్తిడిని పరిష్కరించుకోవడం వంటివి స్తబ్దుగా ఉన్న వృద్ధిని వేగవంతం చేయడానికి తోడ్పడతాయన్నారు.

‘విదేశీ రుణ నిబంధనలు సులభతరం కావడం, కమోడిటీల ధరలు కోలుకోవడం వంటి వాటి ద్వారా అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ తక్కువ, ప్రతికూల వడ్డీ రేట్ల వంటి విధానాలు, ప్రైవేటు రుణాలు అధిక స్థాయిలో ఉండడం, బ్యాంకింగ్ రంగంలో రుణాల పరంగా బలహీనతలతో ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి సమస్యలు అలానే ఉన్నాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన పనితీరును కనబరుస్తున్నామని, అయినా.. ప్రస్తుతం తాము సాధిస్తున్న వృద్ధి రేటు సరిపోదని చెప్పారు.

>
మరిన్ని వార్తలు