కన్నాట్‌ ప్లేస్‌ అత్యంత ఖరీదు

12 Jul, 2018 00:38 IST|Sakshi

ఏడాదికి అద్దె చ.అ.కు రూ.10,532 

ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్‌ ఆఫీస్‌ మార్కెట్లో 9 వ స్థానం 

26వ స్థానంలో ముంబైలోని బీకేసీ మార్కెట్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్లో మన దేశం నుంచి రెండు నగరాలకు చోటు దక్కాయి. ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ 9వ స్థానంలో నిలవగా.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్‌ (బీకేసీ) 26వ స్థానంలో నిలిచాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ నివేదిక తెలిపింది. ప్రైమ్‌ ఆఫీస్‌ మార్కెట్‌ వృద్ధికి ప్రధాన కారణంగా సాంకేతికత, ఆర్ధిక వృద్ధి, ఈ–కామర్స్‌ రంగం అభివృద్ధేనని సీబీఆర్‌ఈ ఇండియా అండ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియా చైర్మన్‌ అన్షుమన్‌ మేగజైన్‌ తెలిపారు. 

అద్దె చ.అ.కు రూ.10,532.. 
ప్రైమ్‌ ఆఫీస్‌ మార్కెట్లో గతేడాది 10వ స్థానంలో నిలిచిన కన్నాట్‌ ప్లేస్‌.. ఈ ఏడాది ఒక స్థానం మెరుగు పరుచుకొని ప్రస్తుతం 9వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏడాది అద్దె చ.అ.కు రూ.10,532, ముంబైలోని బీకేసీ మార్కెట్‌లో చ.అ.కు రూ.6,632లుగా ఉంది. అలాగే ముంబైలోని సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (సీబీడీ) ఖరీదైన ప్రాంతాల్లో 37వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏడాదికి అద్దె చ.అ.కు రూ.5,002గా ఉంది. 

ఆసియా పసిఫిక్‌ జోరు.. 
ప్రపంచవ్యాప్తంగా 120 నగరాల్లో ప్రైమ్‌ ఆఫీస్‌ మార్కెట్‌ ఆక్యుపెన్సీ స్థాయి, ధరలపై సర్వే చేసింది. గత ఏడాది కాలంలో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్‌ ఆఫీస్‌ మార్కెట్‌ ఆక్యుపెన్సీ వ్యయ వృద్ధి అన్ని రీజియన్లలోనూ స్థిరంగా ఉందని నివేదికలో తేలింది. అద్దెలు, పన్నులు, సర్వీస్‌ చార్జీలు ఇతరత్రా ఆఫీస్‌ వ్యయాలను కలిపిన ప్రైమ్‌ ఆఫీస్‌ మార్కెట్‌ ఏటా 2.4 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని నివేదిక తెలిపింది. ఆర్ధిక వృద్ధి, స్థిరాస్తి లీజింగ్‌ లావాదేవీలు పెరగడంతో ఈఎంఈఏ, ఆసియా పసిఫిక్‌ రీజియన్లలో గతేడాది కంటే ఈ ఏడాది వృద్ధి వేగంగా జరిగింది. అమెరికాలో 3.2 శాతం, యూరప్, మిడిల్‌ ఈస్ట్, ఆఫ్రికా (ఈఎంఈఏ) 2 శాతం, ఆసియా పసిఫిక్‌ 1.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 

తొలి స్థానంలో హాంకాంగ్‌.. 
అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్‌లో హాంకాంగ్, లండన్, బీజింగ్‌ నగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. హాంకాంగ్‌ సెంట్రల్‌లో వార్షిక అద్దె చ.అ.కు రూ.21,067, లండన్‌లో రూ.16,149, బీజింగ్‌లోని ఫైనాన్స్‌ స్ట్రీట్‌లో రూ.13,806గా ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో హాంకాంగ్‌లోని కౌవ్‌లూన్‌ (రూ.13,026), చైనాలోని సీబీడీ (రూ.13,018), న్యూయార్క్‌లోని మన్‌హటన్‌ (రూ.12,629), మిడ్‌టౌన్‌ (రూ.11,789), టోక్యోలోని మరూంచీ (రూ.11,784) ప్రాంతాలు నిలిచాయి.  

మరిన్ని వార్తలు