కార్యకలాపాల విస్తరణలో ‘రేజర్‌పే’

10 Jun, 2017 01:04 IST|Sakshi
కార్యకలాపాల విస్తరణలో ‘రేజర్‌పే’

ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పేమెంట్‌ గేట్‌వే సేవల సంస్థ రేజర్‌ పే.. త్వరలో ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోకి కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో ఇండొనేసియా, మలేసియా తదితర దేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సంస్థ సహవ్యవస్థాపకుడు హర్షిల్‌ మాథుర్‌ చెప్పారు. స్టార్టప్‌ సంస్థలకు తోడ్పాటు కోసం ఉద్దేశించిన రెవప్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారమిక్కడికి వచ్చిన సందర్భంగా విలేకరులకు ఈ విషయాలు తెలిపారు. పేమెంట్‌ సేవలు, ఇంటర్నెట్‌ సదుపాయం తదితర అంశాల్లో భారత్‌ తరహా పరిస్థితులు ఉన్న దేశాల్లోకి విస్తరించాలని భావిస్తున్నట్లు వివరించారు.

ఇక దేశీయంగా బీమా, విద్యా సంస్థలకు కూడా పేమెంట్‌ సేవలు అందించడంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 35,000, హైదరాబాద్‌లో 500 పైగా వ్యాపార సంస్థలు తమ సర్వీసులు వినియోగించుకున్నట్లు చెప్పిన మాథుర్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్యను  60,000కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. వీడియోకాన్‌ ఇండస్ట్రీస్, నంబర్‌మాల్‌ తదితర సంస్థలు తమ క్లయింట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఈసారి లావాదేవీల పరిమాణం, ఆదాయంలో పది రెట్లు వృద్ధి అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటిదాకా 11.5 మిలియన్‌ డాలర్లు సమీకరించామని, అవసరాన్ని బట్టి వచ్చే ఏడాది ప్రారంభంలో మరో విడత నిధులు సమీకరించే అవకాశం ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు