వచ్చే ఏడాది ఇన్‌ఫ్రాకి గడ్డుకాలమే

16 Feb, 2016 01:25 IST|Sakshi
వచ్చే ఏడాది ఇన్‌ఫ్రాకి గడ్డుకాలమే

రోడ్లు, థర్మల్ పవర్‌ని వీడని కష్టాలు
ఎయిర్ పోర్టులు, రేవుల పరిస్థితి కొంత బెటర్
ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ మౌలిక వసతుల రంగం వచ్చే ఏడాది కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. కీలకమైన బీవోటీ రోడ్డు ప్రాజెక్టులు, ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు గాడిలో పడటానికి ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి మొత్తం ఇన్‌ఫ్రా రంగానికి నెగిటివ్ రేటింగ్ ఇచ్చినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డెరైక్టర్(ఇన్‌ఫ్రా, ప్రాజెక్ట్ ఫైనాన్స్) వెంకటరమణ్ రాజారామన్ తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో 2016-17 సంవత్సరానికి సంబంధించి ఇన్‌ఫ్రా రంగ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విండ్, సోలార్ ఎనర్జీ, ఎయిర్‌పోర్టు, సీపోర్టులకు మాత్రం ఈ ఏడాదిలాగే వచ్చే సారి కూడా స్టేబుల్ రేటింగ్‌ను ఇచ్చినట్లు తెలిపారు.

బీవోటీ ప్రాజెక్టులు చేపట్టిన చాలా కంపెనీలు సీడీఆర్, ఎస్‌డీఆర్ ప్యాకేజీలకు వెళ్లడటంతో వాటికి నిధుల కొరత కష్టంగా ఉందన్నారు. టోల్ ప్రాజెక్ట్ ట్రాఫిక్‌లో 37% అత్యధిక వాటా (ఆదాయంలో 13%) కలిగిన కార్ల సంఖ్యలో, అలాగే ఆదాయంలో 54% వాటా(ట్రాఫిక్‌లో 27%) కలిగిన మల్టీ యాక్సిల్ వెహికల్స్‌లో వృద్ధి తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో కేంద్రం వచ్చే ఏడాది 60% పైగా ఈపీసీ పద్ధతిలోనే కాంట్రాక్టులను అప్పచెప్పొచ్చని అంచనా వేసింది. ఇక విద్యుత్ రంగ విషయానికి వస్తే డిమాండ్‌ను మించి యూనిట్ల స్థాపన జరగడంతో టారిఫ్ రేట్లు తగ్గుతున్నాయన్నారు. తగ్గిన విమాన ఇంధన ధరలతో దూర ప్రయాణీకులు ఇప్పుడు విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతుండటంతో ఈ రంగంలో కొంత ఆశావాహక పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ-కామర్స్ పుణ్యమా అని పోర్టులు కూడా ఈ ఏడాది కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేయొచ్చని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.

మరిన్ని వార్తలు