విదేశీ ఆటోమొబైల్‌ కంపెనీలకు గడ్డుకాలం

12 Nov, 2018 01:58 IST|Sakshi

పడిపోయిన ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాల పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగం ఆటోమొబైల్‌ సంస్థలకు సంతోషాన్నివ్వలేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా భారత ఆటోమొబైల్‌ మార్కెట్లో బలమైన స్థానం కోసం పోటీ పడుతున్న విదేశీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మొత్తం 17 ఆటోమొబైల్‌ సంస్థల్లో సగానికి పైగా కంపెనీల ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు ఏప్రిల్‌–అక్టోబర్‌ కాలంలో తగ్గిపోవడం గమనార్హం. సియామ్‌ గణాంకాల ప్రకారం... అంతర్జాతీయ బ్రాండ్లు అయిన వోక్స్‌వ్యాగన్, రెనో, నిస్సాన్, స్కోడాల విక్రయాలు తగ్గిన వాటిల్లో ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్‌ విక్రయాలు ఏప్రిల్‌–అక్టోబర్‌ కాలంలో 24 శాతం తగ్గి 21,367 యూనిట్లుగా ఉన్నాయి. రెనో విక్రయాలు 27 శాతం క్షీణించి 47,064 యూనిట్లుగా ఉన్నాయి.  నిస్సాన్‌ మోటార్స్‌ ఇండియా 22,905 వాహనాలను విక్రయించగా, ఇది గతేడాది ఇదే కాలంతో చూస్తే 27 శాతం తక్కువ. స్కోడా ఆటో ఇండియా అమ్మకాలు 9,919 యూనిట్లుగా ఉండగా, ఇది 18 శాతం తక్కువ. ఫియట్‌ ఇండియా అమ్మకాలు సైతం 70 శాతం తగ్గి 481 యూనిట్లకు పరిమితం అయ్యాయి.

భారత కార్యకలాపాలు లాభసాటిగా లేకపోవడంతో జనరల్‌ మోటార్స్‌ గతేడాది ఇక్కడ అమ్మకాలకు స్వస్తి చెప్పడం తెలిసిందే. ఇక దేశీయ సంస్థల్లో ఫోర్స్‌ మోటార్స్‌ అమ్మకాలు 17 శాతం, మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ అమ్మకాలు 32 శాతం తగ్గాయి. మారుతి సుజుకీ ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు మాత్రం 9 శాతం, హ్యుందాయ్‌ మోటార్స్‌ 4 శాతం, టాటా మోటార్స్‌ 26 శాతం, హోండా కార్స్‌ 3 శాతం చొప్పున అమ్మకాలు పెంచుకున్నాయి.

మరిన్ని వార్తలు