టోకు ధరల ఊరట!

15 Sep, 2018 02:23 IST|Sakshi

ఆగస్టులో ద్రవ్యోల్బణం 4.53 శాతం

4 నెలల్లో ఇదే అతి తక్కువ స్థాయి

ఆహారోత్పత్తుల ధరల తగ్గుదల కారణం  

న్యూఢిల్లీ: రిటైల్‌ ధరల తరహాలోనే టోకు ధరలు కూడా ఆగస్టులో శాంతించాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.53 శాతం పెరిగింది. అంటే ఈ బాస్కెట్‌ మొత్తం ధర 2017 ఆగస్టుతో పోల్చితే 2018 ఆగస్టులో కేవలం 4.53 శాతమే పెరిగిందన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం నమోదుకావడం నాలుగు నెలల్లో ఇదే తొలిసారి.

మే నెల్లో 4.43 శాతం నమోదయిన టోకు ధరల సూచీ అటు తర్వాతి రెండు నెలల్లో వరుసగా 5.77 శాతం, 5.09 శాతంగా నమోదయ్యింది. కాగా గత ఏడాది ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణం 2018 ఆగస్టుకన్నా తక్కువగా 3.24 శాతంగా నమోదుకావడం గమనార్హం. మరోవైపు ఆగస్టులో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్టస్థాయిలో 3.69 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.  ప్రధాన 3 విభాగాలనూ వేర్వేరుగా చూస్తే...

ప్రైమరీ ఆర్టికల్స్‌: ఫుడ్, నాన్‌–ఫుడ్‌ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం అసలు పెర క్కపోగా, 0.15 శాతం క్షీణించింది. 2017 ఆగస్టు లో ఈ విభాగంలో పెరుగుదల రేటు 2.97 శాతం.
ఇక ఒక్క ఫుడ్‌ ఆర్టికల్స్‌ను చూస్తే, ద్రవ్యోల్బణం 5.82 శాతం నుంచి 4.04 శాతానికి తగ్గింది. జూలైలో కూరగాయల ధరలు 14.07 శాతం తగ్గితే, ఆగస్టులో 20.18 శాతం తగ్గాయి. బంగాళదుంప ధరలు 72 శాతం తగ్గాయి. ఉల్లి ధరలు 27 శాతం తగ్గితే, పండ్ల ధరలు 16 శాతం తగ్గాయి. పప్పుల ధరలు 16 శాతం తగ్గాయి.   
నాన్‌–ఫుడ్‌ ఆర్టికల్స్‌లో మాత్రం 3.44% క్షీణత నుంచి 3.48 శాతం పెరుగుదలకు మారింది.  
 ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌: ద్రవ్యోల్బణం 9.86 శాతం నుంచి 17.73 శాతానికి చేరింది.
   తయారీ: మొత్తం సూచీలో దాదాపు 65 శాతం ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 2.36 శాతం నుంచి 4.43 శాతానికి పెరిగింది.  

అయినా రేటు పెంపే..!
ద్రవ్యోల్బణం తగ్గుదల, పారిశ్రామికోత్పత్తి మెరుగైన వృద్ధి ఉన్నప్పటికీ.. రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) సమీప కాలంలో రేటు పెంచే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అవకాశాలు, క్రూడ్‌ ధరల తీవ్రత భయాలు, డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత వంటి అంశాలను నిపుణులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

మరిన్ని వార్తలు