ఉల్లి, ఆలూ ధరలు ప్రియం

15 Feb, 2020 08:21 IST|Sakshi

జనవరిలో డబ్ల్యూపీఐ 3.1 శాతం  

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి గణాంకాలు ఒకవైపు ఆహార ధరల తీవ్రతను, మరోవైపు కీలక తయారీ రంగంలో మందగమనాన్ని సూచించాయి. 2020 జనవరిలో సూచీ రేటు మొత్తంగా 3.1 శాతంగా నమోదయితే, ఒక్క తయారీ రంగంలో ధరల పెరుగుదల రేటు 0.34 శాతంగా ఉంది. కాగా 2019 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.76 శాతం. ఇక 2019 ఏప్రిల్‌లో 3.18 శాతం టోకు ద్రవ్యోల్బణం నమోదయిన తర్వాత, మళ్లీ ఆ స్థాయి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. శుక్రవారం విడుదలైన ఈ గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...

ప్రైమరీ ఆర్టికల్స్‌: ఫుడ్, నాన్‌–ఫుడ్‌ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 10.01 శాతంగా ఉంది. అంటే 2019 జనవరితో (అప్పట్లో 3 శాతం) పోల్చితే ఈ బాస్కెట్‌ మొత్తం ధర 10.01 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇందులో ఒకటైన ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ ధర 2.41 శాతం (2019 జనవరిలో) నుంచి 11.51 శాతానికి పెరిగింది. సామాన్యునిపై నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని ఈ రేటు సూచిస్తోంది. నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌ ద్రవ్యోల్బణం రేటు 2.32% నుంచి 7.05 శాతానికి ఎగసింది.  
ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌: మొత్తం సూచీలో దాదాపు 13 శాతం వెయిటేజ్‌ ఉన్న  ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 1.85 శాతం నుంచి 3.42 శాతానికి పెరిగింది.  
తయారీ ఉత్పత్తులు: ఐఐపీలో దాదాపు 64 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగ ఉత్పత్తుల్లో ద్రవ్యోల్బణం రేటు 2.79 శాతం నుంచి 0.34 శాతానికి దిగింది. ఆర్థిక వ్యవస్థలో మందగమన ధోరణిని సూచిస్తున్న అంశమిది. 

కూరగాయల ధరలు 53 శాతం అప్‌...
కూరగాయల ధరలు భారీగా 52.72 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 293 శాతం ఎగశాయి. ఆలూ ధరలు 87.84 శాతం ఎగశాయి. ఈ వారం మొదట్లో వెలువడిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణ 6 సంవత్సరాల గరిష్టస్థాయిలో 7.59 శాతంగా నమోదవడం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు