షావోమీ గిన్నిస్‌ రికార్డు

21 Nov, 2018 00:01 IST|Sakshi

ఒకే రోజున 500 స్టోర్లు ప్రారంభం

వచ్చే ఏడాది ఆఖరుకు 5 వేల స్టోర్స్‌ లక్ష్యం

న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం షావోమీ ఒకే రోజున 500 రిటైల్‌ స్టోర్స్‌ను ప్రారంభించి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకుంది. భారత గ్రామీణ ప్రాంతాల్లో ’మి స్టోర్స్‌’ పేరిట అక్టోబర్‌ 29న వీటిని ప్రారంభించామని షావోమీ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్‌ తెలిపారు.

ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఉన్న పెద్ద స్థాయి ‘మి హోమ్‌‘ స్టోర్స్‌ తరహాలోనే ఇవి కూడా ఉంటాయని తెలియజేశారు. 2019 ఆఖరు నాటికి 5,000 పైచిలుకు ’మి స్టోర్స్‌’ను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు జైన్‌ చెప్పారు. దీనివల్ల 15,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. ‘మి స్టోర్‌’ ఒకొక్కటీ సుమారు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.  

పూర్తిగా ఆన్‌లైన్‌ అమ్మకాలతో ప్రారంభమైన షావోమీ.. భారత్‌లో అత్యంత వేగంగా ఆఫ్‌లైన్‌ రిటైల్‌ విభాగంలోనూ విస్తరిస్తోంది. ప్రస్తుతం 50 దాకా ఉన్న మి హోమ్‌ స్టోర్స్‌ సంఖ్యను 100కి పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. కేవలం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌కే పరిమితం కాకుండా లగేజీ, పాదరక్షలు, దుస్తులు వంటి టెక్నాలజీయేతర విభాగాల్లోకి కూడా షావోమీ ప్రవేశిస్తోంది.

>
మరిన్ని వార్తలు