18 రోజుల్లో 10 లక్షల షావోమి ఫోన్ల విక్రయం

21 Oct, 2016 01:48 IST|Sakshi
18 రోజుల్లో 10 లక్షల షావోమి ఫోన్ల విక్రయం

బీజింగ్: చైనా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ ఈ దీపావళి పండుగ సీజన్‌లో ఒక్క భారత్‌లోనే 18 రోజుల్లో 10 లక్షల ఫోన్లను విక్రయించింది. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో అతిపెద్ద మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీగా అవతరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు షావోమి వ్యవస్థాపకుడు, సీఈవో లీ జున్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ భారతదేశమేనని, తమ గ్లోబలైజేషన్ లక్ష్యాల సాకారానికి భారత్ అత్యంత కీలకమని చెప్పారాయన.

చైనా తర్వాత ఇండియానే తమ అతి పెద్ద మొబైల్ మార్కెట్‌గా అభివర్ణించారు. ‘‘ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్లు పెంచుతాం. కార్యకలాపాలను మరింత విస్తరిస్తాం’’ అని లీ వివరించారు. భారత్‌లో ఇప్పటికే పలు చైనా కంపెనీలు రకరకాల వ్యూహాలతో అమ్మకాలు పెంచుకుంటున్నాయి. షావోమీ అమ్మకాలు చైనాలో ఈ మధ్య తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో షావొమీ వాటా పెరగటం గమనార్హం. అందుకే ఈ కంపెనీ భారత్‌కు అధిక ప్రాధాన్యమిస్తోంది.

మరిన్ని వార్తలు